‘మనోభావాలు దెబ్బతింటే మన్నించండి’

21 Jul, 2020 12:14 IST|Sakshi

విప్లవ్‌ దేవ్‌ క్షమాపణ

అగర్తలా : పంజాబీలు, జాట్లపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ వెనక్కి​తగ్గారు. పంజాబీలు, జాట్లు శారీరకంగా దృఢంగా ఉంటారని, అయితే బెంగాలీలకున్న తెలివితేటలు వారికి ఉండవని విప్లవ్‌ దేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పంజాబీలు, జాట్లపై కొందరికున్న అభిప్రాయాలను మాత్రమే తాను తేటతెల్లం చేశానని, ఏ ఒక్కరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని మంగళవారం ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పంజాబీలు, జాట్లను చూసి తాను గర్విస్తానని, వారితో కలిసి తన జీవిత పయనం సాగిందని చెప్పుకొచ్చారు. ‘ ఈ రెండు వర్గాల్లో నాకు పలువురు స్నేహితులున్నారు..నా వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే క్షమించాలని వేడుకుంటున్నా..దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబీ, జాట్‌ సోదరుల పాత్రను నేను ఎప‍్పటికీ గౌరవిస్తుంటా..ఆధునిక భారత నిర్మాణంలో వీరి పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడం తాను ఎన్నడూ ఊహించబోన’ని విప్లవ్‌ దేవ్‌ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

కాగా, అగర్తలా ప్రెస్‌ క్లబ్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విప్లవ్‌ దేవ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాయి. దేశంలో ప్రతి వర్గానికీ ఓ ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెబుతూ బెంగాలీలు తెలివితేటలకు పెట్టింది పేరని..పంజాబీలు, జాట్లు శారీరకంగా బలంగా ఉన్నా తెలివితేటల్లో బెంగాలీలకు సరిపోరని విప్లవ్‌ దేవ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పంజాబీని సర్ధార్‌ అంటారని, వారికి తెలివితేటలు తక్కువగా ఉన్నా చాలా దృఢంగా ఉంటారని వారిని బలంలో ఎవరూ గెలవలేరని, ప్రేమతోనే వారిని జయించాలని అన్నారు. ఇక హరియాణాలో పెద్దసంఖ్యలో ఉండే జాట్లకు తెలివితేటలు తక్కువగా ఉన్నా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. జాట్‌తో ఎవరైనా పెట్టుకుంటే అతడు ఇంటి నుంచి తుపాకీతో బయటకు వస్తాడని అన్నారు. విప్లవ్‌ దేవ్‌ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

దేవ్‌ వ్యాఖ్యలు బీజేపీ సంస్కృతికి అద్దం పడుతున్నాయని కాంగ్రెస్‌ సహా పలు విపక్ష నేతలు ఆరోపించారు. ఇక విప్లవ్‌ దేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన ‘మహాభారతంలో ఇంటర్నెట్‌ ఉంది.. మే డే రోజున ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకు?.. విద్యావంతులైన యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆవులను పెంచుకోవాలి.. లేదంటే పాన్‌షాప్‌ పెట్టుకోవాలి’ వంటి సూచనలు చేసి విమర్శలపాలయ్యారు.

చదవండి : బెంగాలీలతో సరితూగలేరు; ఇది సిగ్గుచేటు!

మరిన్ని వార్తలు