సీఎంగా బీరేన్‌ ప్రమాణం

16 Mar, 2017 01:47 IST|Sakshi
సీఎంగా బీరేన్‌ ప్రమాణం

మణిపూర్‌లో 8 మందికి మంత్రి పదవులు.. మోదీ శుభాకాంక్షలు  

ఇంఫాల్‌/న్యూఢిల్లీ: మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బుధవారం కొలువైంది. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రిగా నాంగ్‌తోంబం బీరేన్‌ సింగ్, మంత్రులుగా మరో ఎనిమిదితో గవర్నర్‌ నజ్మా హెప్తుల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)కి ఉప ముఖ్యమంత్రి పదవి సహా అత్యధికంగా నాలుగు మంత్రి పదవులు దక్కాయి. దీంతో ఎన్‌పీపీ తరఫున గెలిచిన అందరికీ మంత్రిపదవులు లభించినట్లైంది. ఎన్‌పీపీకి చెందిన వై.జాయ్‌కుమార్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది.

మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో బీజేపీ నుంచి బిశ్వజిత్‌ సింగ్, ఎన్‌పీపీ నుంచి జయంత్‌కుమార్‌ సింగ్, హావ్‌కిప్, కాయిసీ, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) నుంచి దిఖో, ఎల్జేపీ నుంచి కరమ్‌ శ్యామ్, బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్యామ్‌ కుమార్‌ ఉన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్, అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ, మణిపూర్‌ మాజీ సీఎం ఇబోబి సింగ్‌ తదితరులు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. మణిపూర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు బీరేన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  

రాలేకపోయిన అమిత్‌ షా, వెంకయ్య
విమానంలో సాంకేతిక లోపం కారణంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేకపోయారు. బుధవారం ఉదయం 9.39 గంటలకు వారి చార్టర్డ్‌ విమానం ఢిల్లీనుంచి మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు బయలుదేరింది. తదనంతరం విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో పైలట్‌ విమానాన్ని 10.17 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి వెనక్కు తీసుకొచ్చాడు. ఆ సమయంలో విమానంలో షా, వెంకయ్యలతోపాటు మరో నలుగురు ప్రయాణికులు ఉన్నారు.

మరిన్ని వార్తలు