దీదీ సర్కార్‌పై ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు

13 Mar, 2019 13:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించిన బీజేపీ అందుకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాల ర్యాలీలతో హోరెత్తించిన కమలనాధులు బెంగాల్‌లో కనీసం 22 లోక్‌సభ స్ధానాల్లో గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇక బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసిన బీజేపీ నేతలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పశ్చిమ బెంగాల్‌ను సమస్యాత్మక రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు.

బెంగాల్‌లో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని తాము ఈసీ దృష్టికి తీసుకువచ్చామని బీజేపీ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. స్ధానిక సంస్థలు, గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, మృతుల వివరాలతో పాటు బీజేపీ నేతల హెలికాఫ్టర్ల ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ వంటి అన్ని అంశాలను ఈసీకి నివేదించామన్నారు.

మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ను బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మోదీ ఓటమే లక్ష్యంగా అవసరమైతే తాను ప్రధాని నియోజకవర్గం వారణాసిలో ప్రచారం చేపడతానని దీదీ సంకేతాలిచ్చారు.

మరిన్ని వార్తలు