విపక్షాల క్షమాపణకు బీజేపీ డిమాండ్‌

1 Jan, 2020 15:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌర చట్టంపై ప్రజలను విపక్షాలు తప్పుదారి పట్టించాయని కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలపై బీజేపీ మండిపడింది. దేశ రాజధానిలో హింసను ప్రేరేపించినందుకు ఈ రెండు పార్టీలు జాతికి క్షమాపణ చెప్పాలని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీ ప్రజలను ఈ పార్టీలు రెచ్చగొట్టడంతో డిసెంబర్‌ 15న జరిగిన నిరసనల్లో హింస చెలరేగిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ వంటి ప్రశాంత నగరంలో పౌర చట్టంపై దుష్ర్పచారం చేయడంతో విద్వేష వాతావరణం నెలకొందని, హింసాత్మక ఘటనల్లో వాటిల్లిన ఆస్తి నష్టానికి కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలే బాధ్యత వహించాలని అన్నారు.

ఈ రెండు పార్టీలు ప్రజలను క్షమాపణ కోరాలని జవదేకర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీ అభివృద్ధికి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇచ్చిన వాగ్ధానాల అమలులో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. తప్పుడు హామీలను ఇచ్చిన కేజ్రీవాల్‌ ఢిల్లీ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌లను అభివృద్ధి పనులు చేపట్టకుండా ఆప్‌ సర్కార్‌ అడ్డుకుందని, రూ 900 కోట్ల నిధులను మంజూరు చేయకుండా తాత్సారం చేసిందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆప్‌ సర్కార్‌పై కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించారు.

మరిన్ని వార్తలు