హర్యానా పీఠంపై ఖట్టార్

22 Oct, 2014 00:20 IST|Sakshi
హర్యానా పీఠంపై ఖట్టార్

సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ నాయకత్వం
శాసనసభాపక్ష నేతగాఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు
{పభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన రాష్ర్ట గవర్నర్
26న ప్రమాణస్వీకారానికి ముహూర్తం        

 
ఛండీగఢ్: హర్యానా సీఎంగా మనోహర్‌లాల్ ఖట్టార్‌ను బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. సుదీర్ఘకాలంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా సేవలందిస్తూ వచ్చిన 60 ఏళ్ల ఖట్టార్.. హర్యానాకు తొలి పంజాబీ ముఖ్యమంత్రి కానున్నారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సమావేశమై ఆయన్ను పార్టీ శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా హాజరయ్యారు. హర్యానా బీజేపీ అధ్యక్షుడు, సీఎం పీఠం కోసం పోటీ పడిన రామ్‌విలాస్ శర్మతో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ సందర్భంగా ఖట్టార్ పేరును ప్రతిపాదించారు. ఈ భేటీ అనంతరం ఖట్టార్‌తో పాటు ఇతర నేతలంతా రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమని వెల్లడించారు. దీంతో ఆయన కూడా అందుకు సమ్మతిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. ఈ నెల 26న ఇక్కడి పంచకులలోని తవు దేవీలాల్ క్రీడా ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. కాగా, ఏకైక ఎమ్మెల్యే ఉన్న బీఎస్పీ కూడా బీజేపీకి తన మద్దతు తెలుపుతూ గవర్నర్‌కు లేఖ ఇచ్చింది. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతు లేఖలు అందజేశారు.

టాస్క్ మాస్టర్ ఖట్టార్

రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, అవినీతిరహిత పాలన అందిస్తానని కాబోయే సీఎం మనోహర్‌లాల్ ఖట్టార్ పేర్కొన్నారు. బీజేపీపై నమ్మకంతో అధికారం కట్టబెట్టినందుకు రాష్ర్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ విజన్‌కు అనుగుణంగా రాష్ర్టంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆయన వివరించారు. పెళ్లి కూడా చేసుకోకుండా 40 ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తగా సేవలకే అంకితమైన ఖట్టార్.. ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇదే తొలిసారి. రోహతక్ జిల్లాలో జన్మించిన ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టాస్క్ మాస్టర్‌గా పార్టీలో తన పని తాను సమర్థంగా చేసుకుపోయే వ్యక్తిగా, నిష్కళంకుడిగా పేరున్న ఖట్టార్‌ను.. ప్రధాని నరేంద్ర మోదీకి, పార్టీ జాతీయాధ్యక్షడు అమిత్ షాకు సన్నిహితుడిగా పేర్కొంటారు. గతంలో ఆయన మోదీతో కలసి పనిచేశారు. మంచి వ్యూహకర్తగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంలో ఖట్టార్ కీలకపాత్ర పోషించారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ హర్యానాలో పార్టీ ప్రచార బాధ్యత లను ఆయనే భుజానేసుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఖట్టార్ నేతృత్వం వహిస్తున్న కర్నాల్ నియోజకవర్గం నుంచే ప్రధాని మోదీ తన ప్రచారాన్ని ప్రారంభించడం గమనార్హం. ఖట్టార్ కుటుంబం దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి వచ్చి హర్యానాలో స్థిరపడింది. అక్కడే 1954లో జన్మించిన ఖట్టార్.. 26 ఏళ్ల వయసులో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు కాశీకి వెళ్లిన సందర్భంగా తన జీవితాన్ని దేశానికే అంకితం చేయాలన్న దృఢ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత బీజేపీలోనూ ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా హర్యానా, గుజరాత్, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన రచించిన వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. ఆయన కార్యదక్షతను గుర్తించిన పార్టీ నాయకత్వం.. ఒక దశలో ఖట్టార్‌కు ఏకంగా 12 రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది.

కలసి పనిచేస్తాం: వెంకయ్య

 హర్యానాలో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో కేంద్రం కలసి పనిచేస్తుందని, ఆ రాష్ర్ట అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలు కలసి పనిచేసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్న ఉద్దేశంతోనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని వెంకయ్య వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీపై ప్రజలు పూర్తి విశ్వాసం ప్రదర్శించారని పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు