చైనా ఈ-రిక్షాలతో చిక్కులు

1 Aug, 2014 22:21 IST|Sakshi
చైనా ఈ-రిక్షాలతో చిక్కులు

సాక్షి, న్యూఢిల్లీ: లక్షల సంఖ్యలో నగర రహదారులపై తిరిగే ఈ-రిక్షాలు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం మాయమయ్యాయి. కోర్టు నిషేధం విధించడంతో ఈ రిక్షాను ఇంట్లోనే ఉంచి కూలీకి బయల్దేరినట్లు మయూర్‌విహార్ మెట్రో స్టేషన్ వద్ద ఈ- రిక్షా నడిపే మహ్మద్ ఖాన్ చెప్పాడు. వీటి నిషేధం వల్ల తామే కాకుండా ప్రయాణికులు సైతం ఇబ్బంది పడుతున్నారన్నాడు. ప్రభుత్వం ఈ-రిక్షాలను నియంత్రించలేకపోయినప్పటికీ కోర్టు ఆ పని చేయగలిగిందని ఈ-రిక్షాలను వ్యతిరేకించే నగరవాసి విజయేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంచితే చైనా నుంచి అడ్డూఅదుపులేకుండా దిగుమతి అవుతున్న ఈ రిక్షాలను ఏవిధంగా నియంత్రించాలనే విషయం అర్థం కాక ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఈ-రిక్షాలను నడపడం చట్టవిరుద్ధమైనప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాలవారు వీటిని దిగుమతి చేసుకుంటున్నారు, ఈ నేపథ్యంలో వాటి దిగుమతిపై ఆంక్షలు విధించనట్లయితే  సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే బ్యాటరీతో నడిచే ఈ రిక్షాలు క్లాసిఫైడ్స్ జాబితాలో లేనందువల్ల వాటి దిగుమతిపై నిషేధం విధించలేమని అధికారులు అంటున్నారు. ఈ-రిక్షా విడిభాగాల అక్రమ దిగుమతిపై చర్య తీసుకోవాలని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ.... వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరింది. ఈ రిక్షా విడిభాగాలు అత్యధిక శాతం చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి.

చైనా నుంచి దిగుమతి అయిన విడిభాగాలతో నగరంలో ఈ రిక్షాలను రూపొందిస్తున్నారు. బాడీ, టైర్ కంట్రోలర్లు, మోటర్ వంటి విడిబాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకుని బ్యాటరీలు, చార్జర్లు, టైర్ ట్యూబుల వంటి స్థానికంగా లభించే విడిభాగాలతో వీటిని రూపొందిస్తున్నారని అధికారులు అంటున్నారు. అయితే వాణిజ్య మంత్రిత్వశాఖ క్లాసిఫైడ్స్ జాబి తాలో ఈ రిక్షాలు లేకపోవడం వల్ల వాటిని, వాటి  విడిభాగాల దిగుమతులను నిషేధించలేకపోతున్నామని వారు  చెబుతున్నారు. ఈ రిక్షాలను నియంత్రించడం కోసం వాటి ఎలక్ట్రిక్ మోటార్లు, గేర్లపై నిషేధం విధించాలని వాణిజ్య మంత్రిత్వశాఖ యోచిస్తోందని అంటున్నారు.
 
నిషేధం తగదు : బీజేపీ
న్యూఢిల్లీ: ఈ-రిక్షాలపై హైకోర్టు నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జం గ్‌కు శుక్రవారం ఓ వినతిపత్రం సమర్పించింది. ఈ-రిక్షాలను మళ్లీ రహదారులపైకి తీసుకొచ్చేందుకు యత్నించాలని ఈ సందర్భంగా విన్నవించింది. నగర రవాణా అవసరాలను తీర్చడంలో ఇవి కీలకపాత్ర పోషించాయని పేర్కొంది. ఎల్జీతో భేటీ అనంతరం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మీడియా తో మాట్లాడారు.

‘కోర్టు ఆదేశాలను శిరసావహిస్తాం. అయితే ఈ-రిక్షాలపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇదొక అసంఘటిత రంగం. ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేయాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీ బ్ జంగ్‌ను కోరాం. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతాం.  ఇవి నగరవాసుల అవసరాలను తీరుస్తున్నాయి. ఈ-రిక్షాల క్రమబద్ధీకరణకు సం బంధించి పదిరోజుల్లోగా కేంద్ర ప్రభుత్వం ఓ విధాననిర్ణయం తీసుకుంటుంది. దీనిపై త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో కేంద్రం చర్చిస్తుంది’ అని అన్నారు.

మరిన్ని వార్తలు