ముస్లిం ఇంటికి నిప్పంటించకుండా కాపాడిన బీజేపీ కౌన్సిలర్‌

25 Feb, 2020 17:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న హింసాకాండ చల్లారటం లేదు. సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి కొందరు ముష్కరులు ఓ ముస్లిం ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నించగా  బీజేపీ కౌన్సిలర్‌ వారిని అడ్డగించి ముస్లిం కుటుంబాన్ని కాపాడిన ఘటన ఉత్తర ఢిల్లీలో జరిగింది. యమున విహార్‌లో సోమవారం రాత్రి నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు 150 మంది ముష్కరులు దగ్గరలోని ముస్లిం కుటుంబాల నివాసాలను చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం దాటుకుని ఓ ముస్లిం ఇంటిని చుట్టుముట్టారు. (హింసాత్మకంగా మారుతున్న సీఏఏ నిరసనలు)

అనంతరం వారికి చెందిన కారు, బైక్‌ వాహనాలకు నిప్పంటించారు. ఈ ముస్లిం కుటుంబానికి సన్నిహితుడైన బీజేపీ వార్డు కౌన్సిలర్‌కు విషయం తెలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆందోళనకారులను అడ్డగించాడు. వారు ఎలాంటి దాడికి పాల్పడకుండా అడ్డుకుని ముస్లిం కుటుంబాన్ని కాపాడాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబంలోని ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘రాత్రి 11.30 గంటల సమయంలో జైశ్రీరాం అంటూ కొందరు గుంపులు గుంపులుగా మా ఇంటి వైపు పరిగెత్తుకు వచ్చారు. మా ఇంటి కింద అద్దెకు ఉంటున్న వ్యక్తి బొటిక్‌తో పాటు, మా వాహనాలను దగ్ధం చేశారు. అనంతరం మా ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రెండు నెలల పాపతో సహా అక్కడనుంచి బయటపడేందుకు ప్రయత్నించాం. కానీ సరిగ్గా అదే సమయంలో వార్డు కౌన్సిలర్‌ వచ్చి మా ఇంటితో పాటు కుటుంబాన్ని కాపాడాడు’ అని పేర్కొన్నారు. కాగా మంగళవారం జరిగిన అల్లర్లలో ఏడుగురు మృతి చెందగా 150 మంది గాయాలపాలయ్యారు. (సీఏఏపై ఆగని ఘర్షణలు..)

మరిన్ని వార్తలు