'వారు ఏజెంట్లుగా ఉండే ప్రమాదం.. తీసేయండి'

27 Jan, 2017 19:59 IST|Sakshi
'వారు ఏజెంట్లుగా ఉండే ప్రమాదం.. తీసేయండి'

లక్నో: ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న కొంతమంది సీనియర్‌ అధికారులను తొలగించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కొంతమంది సీనియర్‌ అధికారులను తొలగించాలని కేంద్రమంత్రి, బీజేపీ నేత ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌తో ఆయన శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి టీ వెంకటేశ్‌ను కలిశారు. యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, డీజీపీని తొలగిస్తే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని అందరికీ హామీ ఇచ్చినట్లవుతుందని అన్నారు.

గత ఐదేళ్లుగా ఈ ఇద్దరు అధికారులు, ఇంకొంతమంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కింద పనిచేస్తు‍న్నారని, వీరుంటే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే వెంటనే వారిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.  లేదంటే అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నలుగురు సీనియర్‌ అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిగా వ్యవహరిస్తున్న వారిని అనుమానిస్తూ ఆయన వినతిపత్రం ఇచ్చారు.

మరిన్ని వార్తలు