-

అహ్మద్‌ పటేల్‌ ఎన్నిక చెల్లదు!

19 Aug, 2017 08:40 IST|Sakshi
అహ్మద్‌ పటేల్‌ ఎన్నిక చెల్లదు!
అహ్మదాబాద్‌: నాటకీయ పరిణామాల నడుమ గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌ పటేల్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నేత బల్వంత్ సింగ్ రాజ్‌పుత్‌ అహ్మదాబాద్‌ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. 
 
రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు(బల్వంత్‌) వేసిన ఓట్లు చెల్లుతాయని, పైగా ఎన్నికల ముందు 44 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూర్‌ తరలించి ఎన్నికల్లో ‘అవినీతి ప్రవర్తన’  కు అహ్మద్‌ పటేల్‌ పాల్పడ్డారని పిటిషన్ లో బల్వంత్‌ పేర్కొన్నారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. 
 
ఆరుగురు కాంగ్రెస్ నేతలు సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందే పార్టీకి గుడ్ బై చెప్పగా, బల్వంత్‌ తోపాటు మరో ముగ్గురు బీజేపీలోకి చేరిపోయారు. ఆపై కాంగ్రెస్‌ పార్టీ తరపున అహ్మద్‌ పటేల్, బీజేపీ తరపున బల్వంత్ బరిలోకి దిగారు . ఇద్దరు రెబల్‌ బ్యాలెట్ ఎమ్మెల్యేలు బల్వంత్‌ కు ఓటు వేసిన అనంతరం బ్యాలెట్ పేపర్లను బహిరంగంగా చూపించారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, అవి చెల్లవని ఈసీ స్పష్టం చేసింది. చివరకు అహ్మద్ పటేల్‌ 44, బల్వంత్‌ రాజ్‌ పుత్‌ కు 38 ఓట్లు పోలు కావటంతో కాంగ్రెస్ సీనియర్ నేతనే విజయం వరించింది.
మరిన్ని వార్తలు