గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గిన విరాళాలు

17 Jan, 2019 15:31 IST|Sakshi

న్యూఢిల్లీ : 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను బీజేపీనే అధిక మొత్తంలో విరాళాలు అందుకుంది. 2017 - 18 కి గాను జాతీయ పార్టీలన్నీ కలిపి మొత్తం రూ.469.89 కోట్లు విరాళాలుగా అందుకున్నాయి. అందులో ఒక్క బీజేపీకే 93 శాతం అనగా రూ.437.04 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది. ప్రతి ఏడాది జాతీయ పార్టీలన్ని తమకు వచ్చిన విరాళాల గురించి ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తాయి. ఈ సమాచారం ప్రకారం ఏడీఆర్‌ ఈ నివేదికను విడుదల చేసింది.

రూ.20 వేలకు పైగా విరాళాలు అందుకున్న జాతీయ పార్టీల వివరాలను ఈ నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి రూ.26.658 కోట్లు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ రూ.2.087 కోట్లు, సీపీఐ(ఎం) రూ.2.756 కోట్లు, సీపీఐ రూ.1.14 6కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రూ.20 లక్షలు విరాళాలుగా అందుకున్నాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)కి కనీసం రూ.20వేలు కూడా రాలేదని తెలిసింది. కాంగ్రెస్‌, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అందుకున్న విరాళాల కంటే బీజేపీకి వచ్చిన విరాళాలు 12 రెట్లు ఎక్కువ.

మొత్తం 4,201 మంది జాతీయ పార్టీలకు విరాళాలు ఇవ్వగా.. అందులో 2,977 మంది బీజేపీకి, 777 మంది కాంగ్రెస్‌కు, 42 మంది ఎన్సీపీకి, 196 మంది సీపీఎమ్‌కు, 176 మంది సీపీఐకి, 33 మంది తృణమూల్‌కు విరాళాలు ఇచ్చినట్లు సదరు నివేదిక తెలిపింది. 2016-17తో పోల్చుకుంటే ఈ ఏడాది జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు 20 శాతం తగ్గినట్లు ఏడీఆర్‌ పేర్కొంది. ఆ ఏడాది అన్ని పార్టీలకు కలిపి రూ.589.38 కోట్లు విరాళాలు రాగా.. 2017 - 18 ఏడాదికి గాను రూ.469.89 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపింది.

మరిన్ని వార్తలు