ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!

28 Oct, 2014 10:16 IST|Sakshi
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!

సాధారణంగా ఎవరికైనా ఒక దెబ్బకు రెండు పిట్టలు పడ్డాయంటారు. కానీ కమలనాథులకు మాత్రం ఒకే దెబ్బకు ఏకంగా మూడు పిట్టలు పడ్డాయి. హర్యానాలో స్పష్టమైన మెజారిటీ సాధించి, తొలిసారి ఎమ్మెల్యే అయిన మనోహర్ లాల్ ఖట్టర్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన బీజేపీ జాతీయ నేతలు.. మహారాష్ట్రలో ముందు మొండికేసిన శివసేనను కూడా చివరకు లొంగదీసుకున్నారు. వాళ్లంతట వాళ్లే కాళ్ల బేరానికి వచ్చేలా చేసుకుని అక్కడ దేవేంద్ర ఫడ్నవిస్ లేదా మరో నేత చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు అంతా రంగం సిద్ధం చేశారు.

ఈ రెండూ ముందునుంచి అనుకున్నవే. కానీ ఇప్పటికిప్పుడే వచ్చిన మరో ఛాన్సు.. ఢిల్లీ సర్కారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో చాలా కాలం నుంచి రాష్ట్రపతి పాలనే కొనసాగుతోంది. అక్కడ ఎవరిని అధికారంలో కూర్చోబెట్టాలా అనే విషయమై అనేకసార్లు తర్జనభర్జన జరిగింది. చివరకు హస్తినపీఠాన్ని కూడా కమలనాథులకే కట్టబెట్టాలని నిర్ణయించారు. బీజేపీ నాయకులను ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మొన్నామధ్య ఓ లేఖ రాశారు. దీనికి ప్రణబ్ నుంచి కూడా సానుకూలంగా సమాధానం వచ్చింది. ఇక ఒకటి రెండు లాంఛనాలను మాత్రం పూర్తిచేసుకుని.. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని పిలవడమే తరువాయి. ఇలా ఒక్క దెబ్బకు మూడు పిట్టలు పడగొట్టి, కమలనాథులు వరుస విజయాలను సాధించగలిగారు.

మరిన్ని వార్తలు