హర్యానా సీఎంగా ఖట్టర్ ప్రమాణం

27 Oct, 2014 02:03 IST|Sakshi
హర్యానా సీఎంగా ఖట్టర్ ప్రమాణం

రాష్ట్రంలో తొలిసారిగా  బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు
మోదీ సహా ప్రముఖుల హాజరు

 
పంచకుల: హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్(60)ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. పెళ్లి కూడా చేసుకోకుండా 40 ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తగా సేవలకే అంకితమైన ఖట్టర్.. ఎమ్మెల్యేగా ఎన్నికకావడం ఇదే తొలిసారి అయినా సీఎం పీఠాన్ని అధిష్టించడం గమనార్హం. హర్యానాలోని పంచకులలో జరిగిన ఈ కార్యక్రమంలో ఖట్టర్‌తో పాటు తొమ్మిది మందితో మంత్రులుగా ఆ రాష్ట్ర గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకి ప్రమాణస్వీకారం చేయించారు. హర్యానా రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేగాకుండా హర్యానాకు తొలి పంజాబీ సీం కూడా ఖట్టరే.

ప్రమాణ స్వీకారాన్ని చండీగఢ్‌లో నిర్వహించే సాంప్రదాయానికి భిన్నంగా.. పంచకులలోని సెక్టార్ 5లో ఉన్న హుడా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్ నేతలు అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మా, వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఖట్టర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజాసంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తు జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కొత్త మంత్రులు అనిల్ విజ్, అభిమన్యు చెప్పారు.
 అభినందించిన మోదీ.. ఖట్టర్‌ను మోదీ అభినందించారు. ఖట్టర్, ఆయన మంత్రివర్గ బృందం హర్యానాను నూతన శిఖరాలకు తీసుకెళతారన్నారు.
 

మరిన్ని వార్తలు