కాశ్మీర్లో కీలకం కానున్న కాషాయం

25 Dec, 2014 12:54 IST|Sakshi
కాశ్మీర్లో కీలకం కానున్న కాషాయం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించనుంది. ఆ పార్టీ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆరేళ్ల ప్రభుత్వంలో మొదటి మూడు సంవత్సరాలు తమ పార్టీకీ ... అది కూడా హిందువును సీఎం అభ్యర్థిని ఎంపిక చేసి తెర మీదకు తీసుకువచ్చేందుకు బీజేపీ తన చర్యలను ముమ్మరం చేసింది. అందుకోసం ఆ పార్టీ ఇప్పటికే ఎన్సీ, పీడీపీలతో చర్చలు ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్లోని మొత్తం 87 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల అయిదు విడతలుగా ఎన్నికలు జరిగాయి.  ఆ ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లు, ఎన్సీ 15 సీట్లు, కాంగ్రెస్ 12 సీట్లు, స్వతంత్ర్య అభ్యర్థులు 7 సీట్లను కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 44 సీట్లు అవసరమవుతాయి.

అయితే రాష్ట్రంలోని ఎన్సీ, పీడీపీలు బద్ద శత్రువులు గల పార్టీలు. ఈ నేపథ్యంలో ఎన్సీ కానీ, పీడీపీ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీతో కలవడం తప్పని సరి పరిస్థితి. దాంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తుంది. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికైన ఏడుగురు కూడా కీలకంగా మారనున్నారు. కాగా ఎన్సీ, బీజేపీతో కలసి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలా అయితే ఎన్ సీ, బీజేపీలు మొత్తం సభ్యుల సంఖ్య 40కు చేరుతుంది. మరో నాలుగురు సభ్యులను తమతో కలుపుకుని బీజేపీ, ఎన్సీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గురువారం న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి, అరుణ్ జైట్లీ, బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్తో భేటీ అయ్యారు. జమ్మూలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై వారంతా చర్చిస్తున్నారు.  అసలైతే ఒమర్ గురువారం లండన్ బయలుదేరవలసి ఉంది. కానీ ప్రభుత్వ ఏర్పాటు విషయంపై చర్చించేందుకు ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు