దళితుడు.. గిరిజనుడు... కాదు కాదు ముస్లిం!

20 Dec, 2018 19:41 IST|Sakshi

హనుమంతుడి ముందు నేతల కుప్పిగంతులు

రోజుకో కులం అంటగడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు

లక్నో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం పొందేందుకో లేదా ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకో రాజకీయ నాయకులు చేసే కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హనుమంతుడు దళితుడు అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ విషయంపై స్పందించిన ఓ జైన మతప్రబోధకుడు హనుమంతుడు జైన మతానికి చెందిన వాడని వ్యాఖ్యానించగా... ఇక ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్‌ యాదవ్‌ ఓ అడుగు ముందుకు వేసి హనుమంతుడి కులాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికేట్‌ జారీచేయాలని వారణాసి జిల్లా కలెక్టరేట్‌లో దరఖాస్తు చేశారు. మరోవైపు జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌.. హనుమంతుడు దళితుడు కాదని గిరిజనుడని ప్రకటించి వివాదాన్ని మరో మలుపు తిప్పారు.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ హనుమంతుడి మతాన్నే మార్చివేసి మరో కొత్త వివాదానికి తెరతీశారు. గురువారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ బుక్కల్‌ నవాబ్‌...‘ హనుమంతుడు ముస్లిం అని నమ్ముతున్నా. అందుకే ముస్లింలు ఆయన పేరు మీదుగానే రెహమాన్‌, ఫర్మాన్‌, జీషన్‌, కుర్బాన్‌ వంటి పేర్లు పెట్టుకుంటారు’  అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా నోరు ఉండి ప్రశ్నించగల ‘ఓటరు దేవుళ్లే’ ఎన్నికల వాగ్దానాలు తప్పిన ప్రజాప్రతినిధులను ఏమీ చేయలేక మౌనం వహిస్తుంటే.. పాపం అందరి తప్పులను మన్నించే గుణం ఉన్న ఆ దేవుడు స్వార్థ రాజకీయాల కోసం తనకు ఎన్ని కులాలు, మతాలు అంటగడితే మాత్రం ఏం చేస్తాడులెండి!

మరిన్ని వార్తలు