రాహుల్‌పై పరువు నష్టం కేసు

31 Mar, 2018 12:31 IST|Sakshi

సాక్షి, లక్నో : ప్రధాని నరేంద్ర మోదీని ఉద్ధేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత శలభ్‌ మని త్రిపాఠి శుక్రవారం రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో ఐపీసీ సెక్షన్‌ 499, 500 (పరువు నష్టం) కింద ఆయన ఫిర్యాదు చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్‌ గాంధీ  వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయం గురించి త్రిపాఠిని మీడియా సంప్రదించగా.. ‘రాహుల్‌ గాంధీ ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో ప్రధాని మోదీని నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీలతో పోల్చారు. అంతేకాక మోదీ అంటేనే అవినీతికి మారుపేరు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వాఖ్యలు బీజేపీ కార్యకర్తలు, దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. అందుకే నేను పరువు నష్టం దావా వేశానని’  వివరించారు.

దీని  గురించి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రటరీ అన్వర్‌ హుస్సెన్‌ మాట్లాడుతూ.. ‘ప్రజల తరుఫున ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా మేము పోరాడుతూనే ఉంటాము. ఈ ప్రభుత్వం అవినీతిని అరికట్టడంలో విఫలమయ్యింది. ప్రజలకోసం మేము కేసులను ఎదుర్కోవడానికి, అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే’ అన్నారు. ఏప్రిల్‌ 5న ఈ కేసు విచారణకు రానున్నట్లు త్రిపాఠి తరపు న్యాయవాది తెలిపారు. ఈ నెల 16, 17, 18న న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి మింగుడు పడటం లేదని తెలుస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు