‘సినిమాను అడ్డుకుని అన్ని థియేటర్లు తగలబెట్టాలి’

21 Nov, 2017 17:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాపై వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇదివరకే ఈ సినిమాను పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీని తీసిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకొనేల తలలు తెచ్చి ఇచ్చే వారికి రూ. 10 కోట్లు వీకెండ్ ఆఫర్ అంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత సూరజ్ పాల్ అము.. మరోసారి ఏకంగా ఫిల్మ్ ఇండస్ట్రీని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

‘దేశంలోని యువత, సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు తలుచుకుంటే ప్రతి సినిమాను అడ్డుకుని థియేటర్లను తగలబెట్టగలరు. ప్రతి సినిమా అడ్డుకోవడానికి వారిలో ఆ సామర్థ్యం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా సినిమాలను సమూలంగా నాశనం చేయాలంటూ’ బీజేపీ నేత సూరజ్ పాల్ చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి సినిమాలను మరొకరు తీయవద్దని, లేదంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్‌ వర్గీయులు ఆందోళన నిర్వహిస్తుండటంతో డిసెంబర్‌ 1న రావాల్సి ఉన్న ఈ సినిమా విడుదల తాత్కాలికంగా నిలిచిపోయింది. పద్మావతి విడుదలకు ముందే రాజ్‌పుత్‌ వర్గీయులతో పాటు కర్ణిసేన బృందానికి సినిమా ప్రివ్యూ చూపించి, వివాదాలకు కేంద్ర బిందువైన సీన్లను తొలగించాలని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి పలువురు కేంద్ర మంత్రులతో పాటు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు. కాగా, మూవీని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ’పద్మావతి’ విడుదలపై తాము జోక్యం చేసుకోలేమని, అది పూర్తిగా సెన్సార్ బోర్డు పరిధిలోని అంశమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు