శివసేన కరపత్రంలో బీజేపీ నేతల ఫొటోలు

9 Oct, 2014 22:06 IST|Sakshi
శివసేన కరపత్రంలో బీజేపీ నేతల ఫొటోలు

మోదీకి మద్దతు పలుకుదాం రమ్మంటూ రాతలు
ఘోసాల్కర్ కుయుక్తులపై బీజేపీ కన్నెర్ర
పొత్తు వికటించకముందు పంచామంటున్న సేన

 
సాక్షి, ముంబై: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వేస్తున్న ఎత్తుగడలు అర్థంకాక ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ప్రచార పోస్టర్లు చూసి అవాక్కవుతున్నారు. దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న శివసేన అభ్యర్థి వినోద్ ఘోసాల్కర్ పంచిన కరపత్రాల్లో మోదీ ఫొటో ఉండడం, ‘శివసేన ఆశీర్వాదాలున్నాయి.. రండి మోదీకి మద్దతు పలుకుదాం’ అంటూ రాసిన రాతలు ఓటర్లను గందరగోళంలోకి నెడుతున్నాయి. శివసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం లేదు కదా..? అయినా మోడీకి మద్దతు పలుకుతూ తనకు ఓటు వేయాలంటూ ఘోసాల్కర్ కరపత్రాలు పంచడంతో ఇంతకీ ఘోసాల్కర్ ఏ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మోడీ బొమ్మ చూసి, ఘోసాల్కర్‌కు ఓట్లు వేస్తారనే దురుద్దేశంతోనే శివసేన ఈ కుయుక్తులు పన్నుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఘోసాల్కర్ నిర్వాకాన్ని దహిసర్ బీజేపీ అభ్యర్థి మనీశ్ చౌదరి తీవ్రంగా విమర్శించారు. ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు ఘోస్కాల్కర్ పన్నుతున్న కుట్రలుగా అభివర్ణించారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు.

ఘోసాల్కర్‌పై ఈసీ చర్య తీసుకునే అవకాశం..
మనీశ్ చౌదరి ఫిర్యాదును ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తే ఘోసాల్కర్‌పై చర్య తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకుడి చిత్రపటాన్ని తమ ప్రచారం కోసం వినియోగించుకోవడం నిబంధనలకు విరుద్ధమంటున్నారు. దీనిపై మొదట ఘోసాల్కర్ నుంచి ఈ వివరణ కోరే అవకాశముందని, వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఆయనపై చర్య తప్పదంటున్నారు.
 
పొత్తు వికటించకముందు పంచినవే...

ఈ కరపత్రాల వివాదంపై శివసేన అభ్యర్థి ఘోసాల్కర్ స్పందించారు. శివసేన-బీజేపీ పొత్తు ఖాయమని భావించినందునే తాను ఈ కరపత్రాలను ముద్రించానని చెప్పారు. పొత్తు వికటించకముందే వాటిని పంపిణీ చేశామని, అప్పటి కరపత్రాలనే ఇప్పుడు బయటపెడుతూ బీజేపీ రాద్ధాంతం చేస్తోందని ఎదురుదాడికి దిగారు. కరపత్రాలతో నిజానికి తమకే నష్టం జరిగే అవకాశముందని, మోదీ చిత్రపటాన్ని చూసినవారు బీజేపీకే ఓటువేసే అవకాశముందని, దానిపై రాసిన రాత కూడా మోడీకి మద్దతు పలకాలంటూ రాసినందున బీజేపీకి ఎలా నష్టం జరుగుతుందంటూ ప్రశ్నించారు. అయితే బీజేపీ మాత్రం ఘోసాల్కర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘోసాల్కర్‌ను మోడీ బలపర్చిన అభ్యర్థిగా ఓటర్లు భావించే అవకాశముందని, ఈ కరపత్రాలతో బీజేపీ నష్టం జరుగుతుందని మనీశ్ చౌదరి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు