సీట్లొచ్చినా మోదీ రాడేమో 

13 Mar, 2019 02:32 IST|Sakshi

శరద్‌ పవార్‌ వ్యాఖ్య

ముంబై: వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలవచ్చునేమో కానీ, ప్రధానిగా మోదీ రెండోసారి పీఠమెక్కే అవకాశాలు తక్కువని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. మహా కూటమి ఏర్పాటులో భాగంగా ఈ నెల 14, 15వ తేదీల్లో ఢిల్లీలో ప్రాంతీయపార్టీల నేతలతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. ‘ లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీగా బీజేపీ అవతరించే అవకాశాలున్నాయి. మిగతా పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు.

ఆ పరిస్థితుల్లో నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానిగా అయ్యే అవకాశాలు తక్కువ’ అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం నుంచి ఇద్దరు బరిలోకి దిగుతున్నందున తాను పోటీ చేయడం లేదని ఆయన వివరించారు. ఓటమి తప్పదని ఆయన ముందే తెలుసుకున్నారంటూ సీఎం ఫడ్నవిస్‌ తన నిర్ణయంపై వ్యాఖ్యానించడంపై ఆయన స్పందిస్తూ.. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఇప్పటి వరకు 14 సార్లు గెలిచాననీ, వాజ్‌పేయి, అడ్వాణీ లాంటి మహామహులకే ఓటమి తప్పలేదని అన్నారు.  

మరిన్ని వార్తలు