తదుపరి టార్గెట్‌ ఆ రెండు రాష్ట్రాలేనా?

31 Aug, 2019 16:27 IST|Sakshi

ఎన్‌ఆర్‌సీ అమలుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తులు

ముంబై, ఢిల్లీపై కేంద్రం దృష్టి?

మహారాష్ట్రలో అమలు చేయాలని శివసేన లేఖ

సాక్షి, న్యూఢిల్లీ: భారత పౌరులను గుర్తించేందుకు బీజేపీ ప్రభుత్వం ఏంతో ‍ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌(ఎన్‌ఆర్‌సీ) బిల్లు దేశ వ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్‌ నుంచి వలస వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేలా చట్టంలో సవరణలు చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తొలివిడత అసోంలో అమలు చేశారు. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే భారత పౌరులుగా గుర్తించారు. దీంతో దాదాపు 19 లక్షల మందికి ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో చోటు దక్కకపోవడంతో వారు ఇకపై విదేశీయులుగా గుర్తింపబడనున్నారు.

ఇక్కడా అమలు చేయండి..
ఎన్‌ఆర్‌సీని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామంటూ బీజేపీ నేతలు బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో తొలుత అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇది వరకే ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించినట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇదిలావుండగా మహారాష్ట్రలో కూడా ఎన్‌ఆర్‌సీని అమలు చేయాలని శివసేన ఎంపీ, కేంద్రమంత్రి అరవింద్‌ సావాంత్‌ కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకే విజ‍్క్షప్తి చేశారు. అక్రమ వలసదారులు కారణంగా నిజమైన స్థానికులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దేశ వాప్తంగా అక్రమ వలసదారులు ఎక్కువగా ముంబైలోనే ఆశ్రయం పొందుతున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు అసోం తరహాలోనే ఢిల్లీలో కూడా అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ డిమాండ్‌ చేశారు. అక్రమ వలసదారులు ఢిల్లీలో తిష్ట వేశారని.. వారి సంఖ్య రాజధానికి ప్రమాదకరంగా పరిణమించిందని పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎన్‌ఆర్‌సీని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో కూడా ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయమని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 

ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ
ఇదిలావుండగా.. బంగ్లాదేశ్‌ సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎన్‌ఆర్‌సీ ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగాల్‌లోనూ అక్రమ వలసదారులు రాజ్యమేలుతున్నారని, వారిని దేశం నుంచి పంపిస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు ప్రకటించారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా, విపక్షాల నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీపై తీసుకునే నిర్ణయం ఉత్కంఠంగా మారింది.

మరిన్ని వార్తలు