‘మీరిద్దరూ ఉండగా.. రాముడికి ఈ గతేంటి’

18 Nov, 2018 12:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు దేశ అత్యున్నత న్యాయస్థానమే అయోధ్య భూవివాదం కేసుపై ఆచితూచి అడుగులేస్తుండగా.. మరోవైపు బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఈ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బాలియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా ఉన్న యోగీ ఆదిత్యనాథ్‌.. అయోధ్యలో రామాలయం నిర్మించకుండా ఏం చేస్తున్నారు. హిందుత్వ వాదులు అంత గొప్ప స్థానాల్లో ఉండగా.. రాముడు ఇంకా టెంట్లలో ఉండడమా’ అని అసహనం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో సురేంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. (అయోధ్యపై సత్వర విచారణకు నో)

మోదీ, యోగీ స్థానంలో ఇంకెవరున్నా ఈ పాటికి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి ఉండేదని చెప్పారు. కరుడు గట్టిన హిందుత్వ వాదులు ఏలుతున్న దేశంలో రాముడు ఇంకా టెంట్‌లోనే ఉండడం బాధాకరమన్నారు. ఇది హిందూ జాతికే  దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రామాలయ నిర్మాణాన్ని ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దనీ..దేవుడి ఆశిస్సులతో ఆలయ నిర్మాణం త్వరలోనే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి దినేష్‌ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాముడు ఎప్పడు తలచుకుంటే అప్పుడే ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. 2010లో అలహాబాద్‌ కోర్టు అయోధ్యలోని వివాదాస్పద రామాలయం-బాబ్రీ మసీదు భూమిని మూడు భాగాలుగా చేసి పంచాలని ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో వాదనలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై వచ్చే ఏడాది జనవరిలో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ఇటీవలే స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు