ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి!

24 Sep, 2017 20:25 IST|Sakshi

ఫరూఖాబాద్: ఆయనో ఎమ్మెల్యే. అందరూ రాజకీయ నాయకుల్లా కాకుండా మంచి మనసుతో తన ప్రత్యేకత చాటుకున్నారు. మానవత్వం ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నారు. ఆపదలో ఉన్న వారిని సరైన సమయంలో ఆదుకుని నిజమైన ప్రజా సేవకుడిగా నిలిచారు. ఎవరూ ఊహించని విధంగా క్షతగాత్రులను తన వీపుపై మోసి అందరి హృదయాలను గెలిచారు. ఆయన పేరు మెజొర్‌ సునీల్‌ దత్‌ ద్వివేది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లా సర్దార్‌ శాసనసభ నియోజకవర్గానికి బీజేపీ తరపున ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఫరూఖాబాద్‌-ఫతేగఢ్‌ మార్గంలో ద్వివేది తన వాహనంలో ఇంటికి వెళుతుండగా ఓ హృదయ విదారక దృశ్యం ఆయన కంటపడింది. భీంసేన్‌ మార్కెట్‌ సమీపంలో ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో రోడ్డు మధ్యలో పడివున్నారు. వీరిని గమనించిన ఆయన వెంటనే తన కారును ఆపి, క్షతగాత్రుల దగ్గరకు వెళ్లారు. తన అనుచరుల సహాయంతో గాయపడిన ముగ్గురిని తన కారులో సమీపంలోని లోహియా ఆస్పత్రికి తరలించారు. స్ట్రెచర్లు అందుబాటులో లేకపోవడంతో ద్వివేది స్వయంగా ఒక క్షతగాత్రుడిని వీపుపై మోసుకెళ్లి అత్యవసర విభాగంలో చేర్చారు. క్షతగాత్రులు అరవింద్‌ సింగ్‌ చౌహాన్‌, రిషబ్, రామేశ్వర్‌ సింగ్‌గా గుర్తించారు. గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే ద్వివేదిని అక్కడున్నవారంతా మనసారా అభినందించారు. ఎమ్మెల్యే అంటే ఇలావుండాలని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు