‘ఆ నేరాలను అడ్డుకోలేం’

11 Aug, 2019 18:05 IST|Sakshi

పట్నా : బిహార్‌లో మహిళలపై నేరాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలపై లైంగిక దాడులు, నేరాలు పెరుగుతున్న క్రమంలో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే బీజేపీ ఎమ్మెల్యే అరుణ్‌ సిన్హా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, ఆర్జేడీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. మహిళలపై ఈ తరహా నేరాలను నిరోధించవచ్చని అయితే వాటిని పూర్తిగా అరికట్టలేమని సిన్హా అన్నారు. బిహార్‌లో ఇటీవల మహిళలపై నేరాలు రొటీన్‌గా మారాయి. కొద్దిరోజుల కిందట ముగ్గురు వ్యక్తులు ఓ మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమెపై హత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు నలందా జిల్లా బెలోర్‌ గ్రామంలో పదహారేళ్ల బాలిక మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో లభ్యమైంది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగులు ఆమెను కిరాతకంగా హత్య చేశారని భావిస్తున్నారు. మఫసిల్‌ జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఓ మైనర్‌ బాలికను హాస్టల్‌ గదిలో నాలుగు రోజుల పాటు బంధించిన నిందితులు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బిహార్‌లో ప్రతిరోజూ నిర్భయ తరహా ఘటనలు జరుగుతున్నాయని, నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం తక్షణమే వీటిపై స్పందించాలని కాంగ్రెస్‌ ప్రతినిధి రాజేష్‌ రాథోడ్‌ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు