రౌడీని దేవుడిగా కీర్తించిన బీజేపీ ఎమ్మెల్యే

11 Jul, 2018 16:42 IST|Sakshi
బీజేపీ ఎమ్మేల్యే సురేంద్ర సింగ్‌ (పాత ఫోటో)

లక్నో : ‘అత్యాచారాలను నివారించడం శ్రీరాముని వల్ల కూడా కాదం’టూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ మున్నా బజరంగీని చంపిన మరో గ్యాంగ్‌ స్టర్‌ సునీల్‌ రాతీని ‘ఉగ్రవాదాన్ని అణచిన దేవుడి’గా వర్ణించారు.

కొన్నేళ్ల క్రితం బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ను హత్య చేసిన గ్యాంగ్‌ స్టర్‌ మున్నా బజరంగీ రెండు రోజుల క్రితం బాగ్‌పట్‌ జైలులో మరో గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ రాతీ చేతిలో హత్యకు గురి అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదాన్ని ఎవరో ఒకరు రూపుమాపాలి. ఆ పని సునీల్‌ రాతీ చేశాడు. హింసను రూపుమాపడానికి భగవంతుడు ఎవరో ఒకరిని.. ఏదో ఒక సమయంలో పురమాయిస్తాడు. అలా ఈ సారి సునీల్‌ రాతీని ఎంచుకున్నాడు. దేవుడు సునీల్‌ రాతీ చేతిలో మున్నా బజరంగీ అనే ఉగ్రవాది అంతం అవ్వాలని అనుకున్నాడు. అందుకే సునీల్‌ రాతీ, బజరంగీని హత్య చేశాడు. కనుక హింసను రూపుమాపిన సునీల్‌ రాతీ భగవంతుడు. నేరస్తుల విషయంలో సాధారణ చట్టాలు ఆలస్యం చేయవచ్చు. కానీ భగవంతుడు ఆలస్యం చేయడు. అందుకే మున్నా బజరంగీని ఇంత తొందరగా అంతమొందించాడు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇంతటితో ఆగక ఏకంగా స్వపక్షాన్ని ఇరుకున పెట్టేలా ‘జైల్లలో నియమించిన అధికారులు అవినీతిపరులు. లంచం తీసుకుని జైలు లోపలికి ఆయుధాలను అనుమతిస్తున్నారు. అందుకు సునీల్‌ రాతీనే ఉదాహరణ’ అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగిని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘డబ్బు ఉంటే చాలు జైలులో ఉండి కూడా ఏమైనా చేయవచ్చు. ఆఖరికి జైలు లోపలికి ఆయుధాలు కూడా తీసుకురావచ్చు. సునీల్‌ రాతీ అధికారులకు డబ్బు ఇచ్చి, ఆయుధాలు తెప్పించుకుని బజరంగీని అంతమొందించాడు’ అని ఆరోపించారు.

బజరంగీ భార్య సీమా సింగ్‌ తన భర్త హత్యకు యోగి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ‘ఇలాంటి వ్యాఖ్యలు చేసే అధికారం మున్నా కుటుంబానికి లేద’న్నారు.

2024 నాటికి భారత దేశం హిందూ రాజ్యంగా మారుతుందంటూ గతంలో సురేంద్ర సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేసి వెలుగులోకి వచ్చారు. అంతేకాక పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రావణాసురిడి సోదరి శూర్పణకతోనూ, అధికారులను వేశ్యలతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు