బీజేపీ ఎంపీ లాకెట్‌ ఛటర్జీకి కరోనా

3 Jul, 2020 16:59 IST|Sakshi

మహమ్మారి విజృంభణ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ బీజేపీ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ కరోనా వైరస్‌ బారినపడినట్టు శుక్రవారం ఆమె స్వయంగా వెల్లడించారు. స్వల్ప జ్వరంతో బాధపడుతూ గత వారం రోజులుగా తాను స్వీయ నియంత్రణలో ఉన్నానని లాకెట్‌ ఛటర్జీ పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, అన్ని వివరాలు మీతో పంచుకుంటానని ఆమె ట్వీట్‌ చేశారు. మహిళా అంశాలపై క్షేత్రస్ధాయిలో చురుగ్గా స్పందించే నేతగా పేరొందిన లాకెట్‌ ఛటర్జీని బీజేపీ అధినాయకత్వం ఇటీవల బెంగాల్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసింది. కాగా బీర్భం జిల్లాలో జూన్‌ 19న అమర జవాన్‌ రాజేష్‌ ఓరంగ్‌ అంత్యక్రియల్లో బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.

వీర జవాన్‌కు వీడ్కోలు పలికేందుకు వందలాదిగా ప్రజలు అంత్యక్రియలకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి సైతం పాల్గొన్నారు. మరోవైపు తన కుమార్తెను లైంగిక వేధింపుల నుంచి కాపాడే క్రమంలో ఓ మహిళ మరణించిన ఘటనపై హౌరాలోని బగ్నాం ప్రాంతంలో బీజేపీ మద్దతుదారులతో కలిసి జూన్‌ 24న రహదారి ముట్టడి కార్యక్రమానికీ లాకెట్‌ ఛటర్జీ హాజరయ్యారు. కాగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఛటర్జీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, సన్నిహితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి : ‘టిక్‌టాక్‌ నిషేధం నోట్ల రద్దు‌ వంటిదే’

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు