ఢిల్లీలో కూడా ప్రారంభించాలి : మనోజ్‌ తివారి

29 Jun, 2019 15:39 IST|Sakshi

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించిన వివాదాస్పద యాంటి రోమియో స్క్వాడ్‌ బృందానికి తాజాగా మరో మద్దతుదారు దొరికారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారి యాంటి రోమియో స్క్వాడ్‌ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. త్వరలోనే దీన్ని ఢిల్లీలో కూడా ప్రారంభిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో బీజేపీ స్టేట్‌ వర్కింగ్‌ కమిటీ ప్రారంభోత్సవానికి హాజరైన మనోజ్‌ తివారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమైన యాంటి రోమియో స్క్వాడ్‌ బృందాల పని తీరు చాలా బాగుంది. మహిళల రక్షణకు ఇది చాలా మంచి పద్దతి. త్వరలోనే దీన్ని ఢిల్లీలో కూడా ప్రారంభిస్తే బాగుంటుంద’న్నారు.

ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడే వారి పని పట్టడం కోసం 2017లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ యాంటి రోమియో స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ బృందాల పని తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల రక్షణ పేరిట ఈ బృందాలు జంటలపై దాడులకు తెగబటమే కాక యువకులకు గుండు కొట్టించడం.. గుంజీలు తీయించడం వంటి దారుణాలకు పాల్పడ్డారు. దాంతో కొన్ని రోజుల పాటు ఈ బృందాల మీద నిషేధం విధించారు. కానీ తాజాగా మహిళల పట్ల నేరాలు పెరుగుతుండటంతో యోగి ఆదిత్యనాథ్‌ ఈ యాంటి రోమియో స్క్వాడ్‌ను తిరిగి పునరుద్దరించారు.

మరిన్ని వార్తలు