ఆ వర్సిటీ తాలిబన్‌కు వత్తాసు..

21 Nov, 2018 11:33 IST|Sakshi

లక్నో : యూపీ బీజేపీ ఎంపీ సతీష్‌ కుమార్‌ గౌతమ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) తాలిబన్‌ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటోందని దుయ్యబట్టారు. ఏఎంయూ క్యాంపస్‌లో జమ్ము కశ్మీర్‌ లేని భారత మ్యాప్‌ను చూపుతున్న పోస్టర్లు దర్శనమిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఏఎంయూ వైస్‌ చాన్సలర్‌కు ఈ మేరకు అలీగఢ్‌ ఎంపీ గౌతమ్‌ లేఖ రాశారు. భారత మ్యాప్‌లో జమ్ము కశ్మీర్‌, ఈశాన్య భారత్‌లో కొంత ప్రాంతం లేకుండా పోస్టర్లను వర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించారని మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని లేఖలో ఎంపీ పేర్కొన్నారు. ఏఎంయూలో దేశ వ్యతిరేక శక్తులు ఇటీవల పేట్రేగిపోతున్నాయన్నది వెల్లడవుతోందన్నారు.

హతమైన హిజ్బుల్‌ ఉగ్రవాది మనన్‌ వనీ  కోసం వర్సిటీలో ప్రార్థన సమావేశాలు జరిగినప్పుడే కఠిన చర్యలు చేపడితే ఇలాంటి చర్యలు జరిగిఉండేవి కావన్నారు. కాగా దేశ విభజనకు వ్యతిరేకంగా క్యాంపస్‌లో నిర్వహించ తలపెట్టిన డ్రామా కోసమే ఈ పోస్టర్లను డ్రామా సొసైటీ రూపొందించిందని ఏఎంయూ అధికారులు వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు