శబరిమలపై బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

3 Jan, 2019 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలను అనుమతించడం మంచి నిర్ణయమని బీజేపీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ సమర్ధించారు. లింగ సమానత్వం సాధించే దిశగా ఇది ముందడుగు వంటిదని అన్నారు. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ఆరెస్సెస్‌, బీజేపీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పరిసంఘ్‌ చైర్మన్‌గా తాను వ్యక్తిగత హోదాలో అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశాన్ని సమర్ధిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

పురుషుడి పుట్టుకకు మూలమైన స్ర్తీ అపవిత్రురాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. భగవంతుడు సర్వాంతర్యామి అంటే ఆలయం వెలుపలా దేవుడు ఉంటాడని, రాజ్యాంగం దృష్టిలో మహిళలు, పురుషులూ సమానమేనని ఉదిత్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. సంప్రదాయాలు కాలానుగుణంగా మారుతాయని, గతంలో బాల్య వివాహాలు, సతీసహగమనం సైతం దేశంలో సంప్రదాయాలుగా ఉండేవని తదనంతరం మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. కాగా, అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్యకు ఉదిత్‌ రాజ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు