'స్టేషన్లో మూడు గంటలు కూర్చోబెట్టి రైలెక్కించారు'

11 Jan, 2016 10:50 IST|Sakshi
'స్టేషన్లో మూడు గంటలు కూర్చోబెట్టి రైలెక్కించారు'

మాల్దా: మాల్దాలో జరిగిన మతపరమైన ఘర్షణలకు సంబంధించి పరిశీలనలు జరిపేందుకు బయలుదేరిన నిజనిర్ధారణ కమిటీని మాల్దా రైల్వే స్టేషన్లో జిల్లా అధికారులు అడ్డుకున్నారు. వారిని అక్కడే నిలిపి ఉంచారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో డిసెంబర్ 3న రెండు వర్గాల మధ్య మతపరమైన ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇవి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య చిచ్చుపెట్టాయి. ఈ రెండు పార్టీలు ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఘర్షణల వెనుక నిజనిజాలను నిగ్గు తేల్చాలని బీజేపీ ముగ్గురు వ్యక్తులతో కూడిన నిజనిర్దారణ కమిటీ వేసింది.

ఇందులో ఎంపీలు భూపేంద్రయాదవ్, రామ్ విలాస్ వేదాంతి, ఎస్ఎస్ అహ్లువాలియా ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి సోమవారం ఉదయం గౌర్ ఎక్స్ ప్రెస్ లో మల్దాకు వచ్చారు. అక్కడి నుంచి ఘటన చోటుచేసుకున్న కాలియాచాక్ వెళ్లాలనుకున్నారు. కానీ, పోలీసులు, స్థానికులు వారిని వెనక్కి వెళ్లాలని చెప్పారు. స్టేషన్ లోని వీఐపీ లాంజ్ లో కూర్చుని మూడు గంటలపాటు వారితో చర్చించారు. ప్రస్తుతం కాలియాచక్ లో 144 సెక్షన్ ఉందని, అక్కడికి ఎవరినీ అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని హౌరాకు చెందిన శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో తిరిగి బలవంతంగా వెనక్కి పంపించారు. దీనిపట్ల ఎంపీ భూపేంద్ర యాదవ్ స్పందిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు అనుసరిస్తోందని, ఉద్దేశ పూర్వకంగా తమను వెనక్కి పంపించారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు