'ఆ వీడియోలో వాయిస్ నాది కాదు'

27 Jun, 2015 18:34 IST|Sakshi
'ఆ వీడియోలో వాయిస్ నాది కాదు'

ముంబై: ప్రధాని నరేంద్ర మోదీపై వ్యాఖ్యలు చేసిన పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజ్ పురోహిత్కు మహారాష్ట్ర బీజేపీ శనివారం నోటీసులు జారీచేసింది. దీనిపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. ఆ వీడియోలో వాయిస్ తనది కాదని, అవసరమైతే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాలని ఆయన బదులిచ్చారు. మోదీతో పాటు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలపై పురోహిత్ వ్యాఖ్యలు చేసినట్లుగా బీజేపీ అధిష్టానం వద్ద వీడియో ఉంది. క్రమశిక్షణ ఉల్లంఘణ చర్యలు చేపట్టాలని భావించి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రావ్ సాహెబ్ దాన్వేకు మూడు రోజుల్లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.

పార్టీ ఎమ్మెల్యే పురోహిత్, ప్రధాని మోదీ, అమిత్ షా లపై, బీజేపీపై వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న వీడియో కొన్ని ఛానళ్లతో పాటు వెబ్సైట్లలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నప్పటికీ తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన అన్నట్లు వీడియోలో ఉంది. కేంద్రంలో చాలా మంచి పనులు చేస్తున్నప్పటికీ మోదీ కొన్ని తప్పులు చేస్తున్నారని, రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒత్తిడిలో పనిచేయలేరని, కేంద్రలో సమీకృత విధానం లేదని తప్పపట్టడం వంటి వ్యాఖ్యలతో ఆగ్రహించిన పార్టీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

మరిన్ని వార్తలు