కోల్‌కతాలో బీజేపీ కార్యాలయం ధ్వంసం

4 Feb, 2019 16:56 IST|Sakshi

కోల్‌కతా : మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం తీవ్రమైంది. బీజేపీ, తృణమూల్‌ నేతలు పరస్పర ఆరోపణలతో తలపడుతుంటే సోమవారం కోల్‌కతాలో బీజేపీ కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. పాలక తృణమూల్‌ కార్యకర్తలే తమ కార్యాలయంపై దాడికి తెగబడ్డారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రం తమపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ నివాసంపై సీబీఐ దాడులను వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ ఢిల్లీలో దీక్షకు దిగడంతో పరిస్ధితి వేడెక్కింది.

బెంగాల్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీని కలిసింది. రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేసింది. సీబీఐ వివాదం నేపథ్యంలో విపక్షాలు మమతా బెనర్జీకి బాసటగా నిలవగా అవినీతిని ప్రతిపక్షాలు సమర్ధిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు అవినీతి ఆరోపణలున్న వారిని విచారించడం నేరమా అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు