వీరుడి చుట్టూ.. వివాదాల గుట్టు

9 Nov, 2018 13:39 IST|Sakshi

టిప్పు సుల్తాన్‌ జయంతిపై కన్నడలో రాజకీయ దుమారం

ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్‌ కొత్త నాటకం : యడ్యూరప్ప

టిప్పు గొప్ప పోరాటయోధుడు : కాంగ్రెస్‌ 

సాక్షి, బెంగళూరు : మైసూర్‌ పులిగా పిలవబడే టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలపై కర్ణాటకలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. జేడీఎస్‌ చీఫ్‌, కర్ణాటక సీఎం కుమారస్వామి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నవంబర్‌ 10న రాష్ట్ర వ్యాప్తంగా టిప్పు సుల్తాన్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని ముస్లింలను ఆకట్టుకునేందుకే జేడీఎస్‌-కాంగ్రెస్‌ టిప్పు ఉత్సవాలను నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ కొత్తనాటకానికి తెరలేపిందని అన్నారు. టిప్పు పాలనలో హిందూవులను చిత్రహింసలకు గురిచేశారని, ఆయనను యాంటీ హిందూపాలకుడిగా బీజేపీ వర్ణించింది.

యడ్యూరప్ప వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ ఖండించారు. 18వ శతాబ్దంలో బ్రిటీష్‌ వారిని ఎదురించిన గొప్ప పోరాడయోధుడు టిప్పుసుల్తానని, అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాలను జరుపుకోవడంలో తప్పేమీ లేదని వివరించారు. పోరాటయోధులను బీజేపీ ఎప్పుడూ గౌరవించలేదని.. టిప్పుపై రాజకీయం ఆరోపణలు చేయడం సమంజసం కాదని శివకుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలనే ఏజెండాతో బీజేపీ ఈ ఆరోపణలకు దిగిందని అన్నారు. టిప్పు ఉత్సవాలను నిర్వహించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గతంలో అభినందిచినట్లు ఆయన గుర్తుచేశారు. గతంలో కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా టిప్పుపై వివాదం రేగింది. ప్రతి ఏడాది టిప్పు జయంతి, వర్థింతి వేడుకల సమయంలో రాజకీయంగా దుమారంరేగడం కన్నడలో సాధారణంగా మారిపోయింది.

కాగా బ్రిటిష్‌ హయాంలో మైసూర్‌ పాలకుడిగా ఉన్న టిప్పు సుల్తాన్‌ వారితో వీరోచితంగా పోరాడి 1799 మే 4న 49 ఏళ్ల వయస్సులో వీరమరణం పొందారు. ముఖ్యంగా యుద్దంలో అనుసరించాల్సిన వ్యూహాలను రచించడంతో టిప్పును దిట్టగా చరిత్రకారులు వర్ణిస్తారు. ఆధునిక చరిత్రలో యుద్దంలో తొలిసారిగా రాకెట్లను ఉపయోగించిన ఘనత  టిప్పు సుల్తాన్‌కే దక్కుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు