నోట్ల రద్దుపై లోలోన కుమిలిపోతున్న నేతలు

16 Nov, 2016 15:30 IST|Sakshi
నోట్ల రద్దుపై లోలోన కుమిలిపోతున్న నేతలు

న్యూఢిల్లీ: తానొకటి తలిస్తే దైవమొకటి తలచిదన్నట్లు నరేంద్ర మోదీ ఒకటి తలిస్తే జరిగింది మరొకటని బీజేపీ నాయకులే లోలోన కుమిలిపోతున్నారు. దేశంలో నల్లకుబేరుల కోరలు పీకేసేందుకు పెద్ద నోట్లను మోదీ పెద్ద మనసుతోనే రద్దు చేసినప్పటికీ సామాన్యులే సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని బీజేపీ నేతలు చెబుతున్నారు.
 
దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను సకాలంలో పరిష్కరించకపోయినట్లయితే అసలుకే మోసం వచ్చేట్లు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ కూడా పార్టీకి సమర్పించిన నివేదికలో ఇదే అభిప్రాయపడిందని వారు చెప్పారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు ఫలితాలను, పర్యవసానాలను, వివిధ వర్గాల స్పందనలను తెలుసుకొని నివేదికను సమర్పించడం కోసం బీజేపీ చార్టర్డ్ అకౌటెంట్లతో ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సోమవారం నాడే తన నివేదికను సమర్పించినప్పటికీ అందులోని అంశాలను ఆధికారికంగా ఇంతవరకు వెల్లడించలేదు.
 
పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను మరి కొన్ని రోజుల్లో చక్కదిద్దకపోయినట్లయితే మోదీ తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని ఆ కమిటీ తన నివేదికలో వెల్లడించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఎనిమిదవ తేదీన మోదీ ప్రకటన వెలువడిన వెంటనే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈ కమిటీని ఏర్పాటు చేశారని వారు చెప్పారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా, ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో నల్ల ధనంపై మోదీ యుద్ధం, పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ పై ఆకర్షణీయమైన పోస్టర్లు రూపొందించి విస్తృతంగా ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని పార్టీ ఎంపీలకు అమిత్ షా పిలుపునిచ్చారని వారు చెప్పారు. అయితే ఈ విషయంలో ఏ ఎంపీ కూడా ఇప్పటివరకు ముందుకు రాలేదని, పార్టీలో అందరి పరిస్థితి ఇప్పుడు మింగాలేని, కక్కాలేని పరిస్థితి ఏర్పడిందని వారంటున్నారు.
 
‘మేము చీకటి లోయలోకి ప్రవేశించాం. ఈ లోయ చివరలో వెలుతురు ఉంటుందో, లేదో కూడా తెలియదు’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటి వరకు బహిరంగంగా విమర్శించిందీ పోరుబందర్ పార్టీ ఎంపీ విఠల్ రాడాడియా ఒక్కరే. దేశంలో నల్లడబ్బును అరిక ట్టేందుకు తాను తీసుకున్న నిర్ణయం విజయం సాధిస్తుందన్న నమ్మకం నరేంద్ర మోదీకి తప్పా, పార్టీ నాయకుల్లో ఎవరికీ లేదని విఠల్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు