మళ్లీ తెర ముందుకు అమిత్‌ షా!

15 Jun, 2020 14:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మళ్లీ అమిత్‌ షా తెర ముందుకు వచ్చారా ! వాస్తవానికి కేంద్ర హోం శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా తెర వెనక్కి ఎన్నడూ వెళ్లింది లేదు. కానీ గత కొన్ని నెలలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఆయన గైర్హాజరీ కనిపిస్తూ వచ్చింది.   2019లో బీజేపీ రెండోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక, మోదీ మొదటి విడత ప్రభుత్వం కన్నా అమిత్‌ షా ప్రముఖ పాత్ర వహించడం కనిపించింది. జమ్మూ కశ్మీర్‌కు దేశ రాజ్యాంగం కల్పించిన  ప్రత్యేక హోదాను రద్దు చేయడంలో, ముస్లింలలో ట్రిపుల్‌ తలాక్‌ విధానాన్ని నిషేధించడంలో, పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ పౌరుల పట్టిక బిల్లులను ఆమోదించడంలో అమిత్‌ షా కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. దాంతో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను కప్పేస్తూ అమిత్‌ షా ముందుకు వస్తున్నారనే వార్తా కథనాలు వినిపించాయి. 

అనూహ్యంగా సీఏఏ, ఎన్‌సీఏలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాకు దూరం జరిగారు. అమిత్‌ షా నిర్ణయాలతో తనకు సంబంధం లేదన్నట్లుగా నరేంద్ర మోదీ వ్యవహరించారు. అదే సమయంలో పలు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి బీజేపీకి ప్రతికూల వార్తలు రావడం ఆరంభమైంది. అదే క్రమంలో ఇటు పార్టీ, అటు ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు తన పాత్రను విస్తరించడం ‘రెండు బోట్లపై అటో కాలు, ఇటో కాలు’ చందంగా తయారైందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆయన కాస్త తెర వెనక్కి వెళ్లినట్లు కనిపించింది. అయినప్పటికీ గత జనవరిలో పార్టీ వర్కింగ్‌ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను గెలిపించడంలో అమిత్‌ షానే కీలక పాత్ర పోషించారు. (చర్చలతో సామరస్య పరిష్కారం : రాజ్‌నాథ్‌)

ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భూజానెత్తుకున్న అమిత్‌ షా, మత పరంగా ఓటర్లను విడగొట్టేందుకు ప్రయత్నించడంతో గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మరో ఘోర పరాజయం చవి చూడడంతో ఆయన దాదాపుగా తెర వెనక్కి వెళ్లారు. కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో కూడా ఆయన అంతగా ప్రజల ముందుకు రాలేదు. దాంతో ఆయన జబ్బు పడ్డారనే ప్రచారం మీడియాలో ఊపందకుంది. ‘లేదు, నేను బాగానే ఉన్నాను’ అంటూ ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ సారి ప్రభుత్వ కార్యకాలాపాలకన్నా పార్టీ కార్యకలాపాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించారు. మహారాష్ట్రలోని శివసేన–ఎన్‌సీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తూ వార్తల్లోకి ఎక్కారు. 

ఓ పక్క దేశంలో కరోనా వైరస్‌ సంక్షోభం కొనసాగుతుండగానే అమిత్‌ షా ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో పార్టీ ర్యాలీలు నిర్వహించారు. రానున్న బీహార్, పశ్చిమ బెంగాల్‌లో ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఆయన ర్యాలీలు నిర్వహించారు. కరోనా సంక్షోభంపై అఖిల పక్ష సమావేశాన్ని తానే నిర్వహించాలనుకోవడం కూడా అమిత్‌ షా పునరాగమనాన్ని సూచిస్తోంది. 

>
మరిన్ని వార్తలు