ప్రియాంక గాంధీకీ ఆ వేధింపులు తప్పలేదు..

3 Jul, 2018 17:36 IST|Sakshi
బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో మహిళలకు భద్రత కరవైందన్న కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ట్వీట్‌కు బీజేపీ దీటుగా బదులిచ్చింది. కథువా ఘటనకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో స్వయంగా ప్రియాంక గాంధీనే వేధింపులకు గురిచేశారని బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్త తనను లైంగికంగా వేధించారన్న మహిళ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆమె ఢిల్లీ పోలీసులను కోరారు.

కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగంలో గతంలో పనిచేసిన ఓ మహిళ స్వయంగా తన సహచరుడే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసుకు ఫిర్యాదు చేశారని, ఆమె ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఆమెకు భద్రత కల్పించాలని మీనాక్షి లేఖి ఢిల్లీ పోలీసులను కోరారు. కాగా మహిళల భద్రత విషయంలో భారత్‌ అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో ముందుందన్న రాయ్‌టర్స్‌ సర్వేను ఉటంకిస్తూ రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ప్రధాని తన గార్డెన్‌లో యోగా వీడియోలు రూపొందిస్తుంటే  మహిళలపై లైంగిక దాడులు, హింస విషయంలో దేశం సిరియా, ఆప్ఘనిస్తాన్‌, సౌదీ అరేబియాలను మించిపోతోందని రాహుల్‌ ట్వీట్‌ చేయడం రాజకీయంగా దుమారం రేపింది.

మరిన్ని వార్తలు