అరుణ్‌ జైట్లీకి తీవ్ర అస్వస్థత

10 Aug, 2019 03:53 IST|Sakshi

ఎయిమ్స్‌లో చికిత్స; ఆసుపత్రికి వెళ్లిన మోదీ, అమిత్‌ షా  

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఉదయం ఆయన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో చేరారు. వెంటనే ఐసీయూలో చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. హృదయం, మూత్రపిండాలు తదితర పలు విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు చికిత్స అందించారు. జైట్లీ అస్వస్థత వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఎయిమ్స్‌కు వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ఎయిమ్స్‌ మెడికల్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ‘ప్రస్తుతం జైట్లీ గుండె స్థిరంగా కొట్టుకుంటోంది. కీలక అవయవాలకు రక్త ప్రసరణ బావుంది.

ఆయనను ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం’ అని ఎయిమ్స్‌ ఆ ప్రకటనలో పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా తదితరులు ఆసుపత్రికి వచ్చి జైట్లీ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వృత్తిపరంగా న్యాయవాది అయిన జైట్లీ.. మోదీ తొలి ప్రభుత్వంలో రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో, విమర్శలను తిప్పికొట్టడంలో జైట్లీ ఎంతో క్రియాశీలకంగా ఉండేవారు. గతేడాది మే నెలలో ఆయనకు మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఎంతోకాలంగా ఆయన షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగానే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ జైట్లీ పోటీ చేయలేదు. 

మరిన్ని వార్తలు