ప్రచారార్భాటం.. తప్పుడు వ్యూహాలు

11 Feb, 2015 04:37 IST|Sakshi
ప్రచారార్భాటం.. తప్పుడు వ్యూహాలు

బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైకి చెప్పుకోకపోయినా.. మోదీ పాలనకు రెఫరెండంగానే భావించింది. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా పార్టీలోని హేమాహేమీలనందరినీ ప్రచారంలోకి దింపింది. 300 మంది ఎంపీలనూ భాగస్వాములను చేసింది.

క్షేత్రస్థాయి సంబంధాలకు, ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉంది. మోదీ హవానే నమ్ముకుంది.

   లోక్‌సభ ఎన్నికల్లో మాదిరే కళ్లు చెదిరే ప్రకటనలు, భారీ సభలు, మీడియా మేనేజ్‌మెంట్‌తో విజయం సాధించవచ్చనుకుంది. భారీ ప్రచార ఖర్చు ఓటర్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

     స్థానిక నేతలను, ఏళ్లపాటుపార్టీని నమ్ముకున్న నాయకులను కాదని, కనీసం వారిని సంప్రదించకుండానే.. పార్టీతో ఏ మాత్రం సంబంధం లేని బేడీని రంగంలో దింపి వ్యూహాత్మకంగా దిద్దుకోలేని పొరపాటు చేసింది. నాయకత్వ లక్షణాల్లోనూ, వాక్చాతుర్యంలోనూ, రాజకీయ అనుభవంలోనూ బేడీ కేజ్రీకి సరితూగలేకపోయారు.

    అకస్మాత్తుగా బేడీని సీఎం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ శ్రేణులు మనఃస్ఫూర్తిగా ప్రచారంలో పాల్గొనలేదు.  

    {పధాని స్థాయిలో ఉన్న మోదీ కేజ్రీవాల్‌ను అరాచకవాది అంటూ తిట్టిపోయడం, హుందాగా వ్యవహరించకపోవడం ఢిల్లీ ఓటర్లకు రుచించలేదు. మోదీ సహా ఆ పార్టీ నేతలంతా కేజ్రీవాల్‌పై విరుచుకుపడటం కేజ్రీవాల్‌కే కలిసొచ్చింది.

    బీజేపీ అనుకూల హిందూత్వ సంస్థలన్నీ ప్రచారంలో పాలు పంచుకోవడం, వారి హిందూత్వ వ్యాఖ్యలు.. అన్ని మతాల ప్రజలు విశేష సంఖ్యలో ఉండే ఢిల్లీలో బీజేపీకి ప్రతికూలంగా మారాయి.

    అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన సందర్భంగా మోదీ తన పేరున్న రూ. 10 లక్షల విలువైన సూట్ ధరించడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఉదంతం  సోషల్ మీడియాలో విరివిగా ప్రచారమైంది. లోక్‌సభ ఎన్నికల్లో చాయ్ వాలా ఇమేజ్‌తో సామాన్యులను ఆకట్టుకున్న మోదీలో.. అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చిన ఈ మార్పు.. మోదీపై ఓటర్ల దృక్కోణంలోనూ మార్పును తీసుకువచ్చి, బీజేపీని దెబ్బతీసింది.

    అధికారంలోకి రాగానే మంచి రోజులొచ్చాయంటూ ఊదరగొట్టిన బీజేపీ 8 నెలల పాలనలో సామాన్యుడికి నిజంగా ఒరిగిందేమీ లేకపోవడం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా పరిణమించింది.

    తన పర్యటనను ముగించుకొని వెళుతూ ‘భారత్‌లో మతసహనం’ అవసరాన్ని ఒబామా నొక్కిచెప్పడంతో దేశవిదేశాల్లో పెద్ద చర్చే జరిగింది. ఎన్నికలకు ముందు బీజేపీకి ఇది ప్రతికూలమే.
 
 
 

మరిన్ని వార్తలు