బీజేపీలో చేరితే ఢిల్లీ సీఎం పదవి ఇస్తామన్నారు

31 Aug, 2014 01:25 IST|Sakshi
బీజేపీలో చేరితే ఢిల్లీ సీఎం పదవి ఇస్తామన్నారు

బీజేపీ ఎంపీ ఒకరు ఆశ చూపారన్న ఆప్ నేత విశ్వాస్
ఆ ఎంపీ మనోజ్ తివారీ అన్న మరో ఆప్ నేత సంజయ్‌సింగ్

 
 సాక్షి, న్యూఢిల్లీ: కొంతమంది ఆప్ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరితే తనను ఢిల్లీ సీఎం చేస్తామంటూ బీజేపీ ఎంపీ ఒకరు ఆశ చూపినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత కుమార్ విశ్వాస్ శనివారం ఆరోపించారు. గత మే నెల 19న ఘజియాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన బీజేపీ ఎంపీ ఒకరు ఈ ప్రతిపాదన తనముందు ఉంచారని, ఇందుకు ఒప్పుకుంటే.. బీజేపీ సీనియర్ నేతలతో మాట్లాడతానని ఆయన పేర్కొన్నట్టు విశ్వాస్ తెలిపారు. ఇందుకు తాను నిరాకరించానని, ఈ వ్యవహారాన్ని మరుసటి రోజు తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి తీసుకుపోయానని చెప్పారు.
 
 ఈ విషయాలను ఎకనమిక్స్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. విశ్వాస్ గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్‌గాంధీపై పోటీచేసి ఓటమి పాలవడం తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ తమను ఆహ్వానించిన పక్షంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనని బీజేపీ సంకేతాలిచ్చిన నేపథ్యంలో విశ్వాస్ చేసిన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీజేపీకి ప్రస్తుతం 28 మంది సభ్యులున్నారు.
 
 ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మొత్తం 34 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు బీజేపీకి కావాలి. కాగా తనకు ఆశ చూపిన బీజేపీ ఎంపీ ఎవరో తెలిపేందుకు విశ్వాస్ నిరాకరించారు. అయితే ఆ ఎంపీ మనోజ్ తివారీ అయి ఉండవచ్చని ఆప్ కీలక నేత సంజయ్‌సింగ్ వెల్లడించారు. 18 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే సీఎం పోస్టు ఇస్తామని ఆశ చూపినట్టు ఆయన ఆరోపించారు. కాగా, తనపై ఆరోపణలను ఎంపీ మనోజ్ తివారీ ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు తన పేరును లాగారన్నారు.

మరిన్ని వార్తలు