తమిళనాట కాషాయం ‘పన్నీరు’!

22 Apr, 2017 22:22 IST|Sakshi
తమిళనాట కాషాయం ‘పన్నీరు’!

చెన్నై: తమిళనాట దాదాపు 20 ఏళ్ల ఎన్నికల అనుభవాలు బీజేపీని పాలక అన్నాడీఎంకేకు దగ్గరయ్యేలా చేస్తున్నాయా? అన్నది నేటి ప్రశ్న. మాజీ సీఎం జయలలిత బతికుండగా, ఆమె మరణించాక ఈ పార్టీ వెంట జాతీయపార్టీ ఇంతగా  పడడం చాలా మందికి అర్ధంకాని విషయం. ఒంటరిగా తమిళనాట ఎదగడానికి బీజేపీ చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదు. ద్రవిడ పార్టీలతో సయోధ్య లేకుండా ఈ రాష్ట్రంలో మనుగడ సాధించడం ప్రస్తుతానికి అసాధ్యం అన్న విషయం బీజేపీ అనుభవసారం. ఇక్కడ కాషాయపక్షం తొలిసారి లోక్‌సభ సీట్లను గెల్చుకున్నది 1998 ఎన్నికల్లో. అదీ జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకేతో పొత్తు వల్లే ఇది సాధ్యమైంది. జయ పార్టీతో కలిసి ఐదు సీట్లకు పోటీచేసి 6. 9 శాతం ఓట్లతో మూడు సీట్లు గెల్చుకుంది.

ఏడాది తిరిగేసరికి తమిళనాట అధికారంలో లేని జయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కలిసి ఏబీ వాజ్‌పేయి సర్కారును కూలదోయడంతో డీఎంకే బీజేపీకి దగ్గరయింది. 1999 సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో డీఎంకే, దాని మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 6 సీట్లకు పోటీచేసి, నాలుగు సీట్లు గెలుచుకుంది. 2004 ఎన్నికలకు ముందు డీఎంకే ఎన్డీఏ నుంచి వైదొలిగి కాంగ్రెస్‌తో చేతులు కలపింది. దీంతో వేరే దారిలేక ఏఐఏడీఎంకేతో మళ్లీ కలిసి పోటీచేసినా ఒక్క సీటూ గెలవలేదు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తే కేవలం 2.3 శాతం ఓట్లతో ఒక్క సీటూ బీజేపీ సాధించలేదు. ఆ తర్వాత 2012 చివరి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఎంత ప్రయత్నించినా లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుకు ఏఐఏడీఎంకే అంగీకరించలేదు.

చివరికి ఆరు చిన్నాచితకా పార్టీలతో కలిసి బీజేపీ 7 సీట్లకు పోటీచేసి గెలిచింది ఒక్క సీటే(నాగర్‌కోయిల్‌ నుంచి గెలిచిన పొన్‌ రాధాకృష్ణన్‌ కేంద్రమంత్రి). 1996లో కూడా ఒంటరి పోరులో బీజేపీ 17 సీట్లకు పోటీచేసి ఒక్క సీటూ కైవసం చేసుకోలేకపోయింది. ఒక్క నాగర్‌కోయిల్‌లో మాత్రం బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో దేశం యావత్తూ మోదీ హవా పనిచేసి కాషాయపక్షానికి ఏకంగా 282 సీట్లు తెచ్చిపెట్టింది. అలాంటిది తమిళనాట ఈ గాలి జయలలిత ప్రభంజనం ముందు నిలబడలేక కేవలం రెండు సీట్లతో(మిత్రపక్షం పీఎంకేకు ఒక సీటు) చతికిలపడింది.

హిందూత్వ శక్తుల విస్తరణే లక్ష్యం!
హిందూ సమాజంలో బ్రాహ్మణాధిపత్యాన్ని, మూఢ విశ్వాసాలను ఖండించి వ్యవసాయ, వృత్తి కులాల మద్దతుతో ముందుకు సాగిన ద్రావిడ ఉద్యమం విజయం సాధించిన తమిళనాట 20వ శతాబ్దం చివరికి బీజేపీ కాలుమోపే వాతావరణం అతి స్వల్ప స్థాయిలో ఏర్పడింది. కాని సొంతగా పోటీచేస్తే ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ ఏదో ఒక ప్రధాన ద్రావిడ ప్రాంతీయ పక్షంతో పొత్తుపెట్టుకున్న ప్రతిసారీ మూడు నాలుగు సీట్లు గెల్చుకోగలిగింది. సిద్ధాంతరీత్యా డీఎంకేతో బీజేపీకి పొసగే అవకాశాలు లేవు. ఏఐడీఎంకేకు చేరువకావాలనుకున్నా జయలలిత ఆధిపత్య ధోరణి వల్ల ఆమె బతికుండగా బీజేపీ సఫలం కాలేదు. పొత్తుపెట్టుకున్నాగాని జయ నీడలో బీజేపీ విస్తరించలేదు. బీజేపీని ఆమె ఎదగనివ్వలేదు.

పొరుగున ఉన్న కర్ణాటకలో మాజీ సీఎం రామకృష్ణ హెగ్డే పొత్తుపెట్టుకుని 1996–2004 మధ్య వేగంగా విస్తరించినట్టు తమిళనాట ఎదగడానికి జయ మరణం బీజేపీకి అనుకూలాంశంగా కనిపించింది. కాని, జయ సన్నిహితురాలు శశికళ కూడా కాషాయపక్షాన్ని తమిళ రాజకీయాల్లో బలపడకుండా అడ్డుకుంటుందని తెలిసి ఓ పన్నీర్‌సెల్వం(ఓపీఎస్‌)పై బీజేపీ కన్నేసింది. అదీగాక, ఓపీఎస్‌ జయ బతికుండగా రెండుసార్లు తాత్కాలిక సీఎంగా ఉండడంతో జయ వారసుడిగా జనం భావిస్తున్నారనే  అంచనాతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఓపీఎస్‌ పక్షాన నిలిచింది. పైకి కనిపించకుండా వెనక నుంచి ఓపీఎస్‌కు మద్దతిస్తూ చివరికి నాలుగోసారి ఆయన సీఎం కావడానికి వ్యూహం రూపొందించింది.

మంచి తరుణం
డీఎంకే నేత ఎం.కరుణానిధి 92 ఏళ్ల వయసులో ఆనారోగ్యంతో రోజూవారీ రాజకీయ పరిణామాలపై మాట్లాడే స్థితిలో లేరు. ఆయన కొడుకు ఎంకే స్టాలిన్‌ సమర్థునిగా ఇంకా నిరూపించుకోలేదు. ఈ పరిస్థితుల్లో జయ ‘వారసురాలు’ శశికళ జైలుపాలవడంతో అన్నాడీఎంకేను చీల్చకుండా, ఈ పార్టీ నేతలను తనకు అనుకూలంగా ‘మలుచుకుని’, కర్ణాటకలో మాదిరిగా వేగంగా పట్టు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ వ్యూహాన్ని చాకచక్యంగా అమలుచేస్తూ ముందుకుసాగుతున్నట్టే కనిపిస్తోది.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

>
మరిన్ని వార్తలు