కేరళలో ‘మూడో’ ముచ్చెమటలు!

24 Apr, 2016 04:04 IST|Sakshi
కేరళలో ‘మూడో’ ముచ్చెమటలు!

 ♦ కుల సంఘాలు, చిన్న పార్టీలతో బీజేపీ కూటమి
 ♦ మూడు జిల్లాల్లో 30 సీట్లపై ప్రత్యేక దృష్టి
 ♦ ఎన్‌డీఏ ‘కింగ్ మేకర్’గా అవతరిస్తుందా?
 
 ఏళ్ల తరబడి రెండు ప్రధాన కూటముల మధ్య పోరాటంగానే సాగిన కేరళ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ నేతృత్వంలో మూడో ముచ్చట బలంగా వినిపిస్తోంది. అది కాంగ్రెస్ సారథ్యంలోని అధికార యూడీఎఫ్, సీపీఎం సారథ్యంలోని ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్‌లను కలవరపాటుకు గురిచేస్తోంది.

 ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వాన్ని మార్చేస్తారని పేరుపడ్డ కేరళీయులు ఈసారీ ఆ ఆనవాయితీ తప్పబోరని ఎన్నికలకు ముందు సర్వేలు అంచనా వేశాయి. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన యూడీఎఫ్ సర్కారును గద్దె దించి ఎల్‌డీఎఫ్‌కు ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తారని రాజకీయ పండితులు లెక్కగట్టారు. అయితే.. రాాష్ట్రంలో అడుగు పెట్టటానికి గత నాలుగు దశాబ్దాలుగా ఒంటరిగా ప్రయత్నిస్తూ విఫలమవుతున్న బీజేపీ.. ఈసారి కొన్ని కుల సంఘాలు, ప్రధాన కూటముల నుంచి వేరుపడ్డ చిన్న గ్రూపులతో జట్టుకట్టి మూడో కూటమిగా బరిలోకి దిగుతోంది. కమ్యూనిస్టుల పట్టుగల ఈళవ సామాజికవర్గం నుంచి ఏర్పడిన శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డీపీ)తో పాటు.. భారత ధర్మ జన సేన (బీడీజేఎస్) తదితర పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ఎన్‌డీఏగా ముందుకు వచ్చింది. రాష్ట్ర జనాభాలో 54 శాతంగా ఉన్న హిందువులను తమ గొడుగుకు కిందకు తెచ్చుకుని అసెంబ్లీలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది.

 30 స్థానాలపై దృష్టి..
 రాష్ట్రంలోని మొత్తం 140 స్థానాలకూ ఎన్‌డీఏ పోటీ చేస్తున్నప్పటికీ.. తమిళనాడు సరిహద్దులోని తిరువనంతపురం, పాలక్కాడ్ జిల్లాలు, కర్ణాటక సరిహద్దులోని కాసారాగోడ్ జిల్లాల్లో గల 30 సీట్లపై ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తోంది. బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానం లేదా, మూడో స్థానంలో నిలిచిన సీట్లవి. గత లోక్‌సభ ఎన్నికల్లో సైతం తిరువనంతపురంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ తొలి స్థానంలో నిలిచింది. అలాగే.. కాసారాగోడ్ జిల్లాలోని రెండు సెగ్మెంట్లలో రెండో స్థానం సాధించింది. ఈ మూడు జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి త్రిముఖ పోరు సాగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇది ప్రధాన కూటములైన యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌లకు ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకించి.. ఎన్నికలకు ముందు జరిపిన కొన్ని సర్వేలు ప్రధాన కూటముల మధ్య హోరా హోరీ పోరు ఉంటుందని జోస్యం చెప్పిన నేపథ్యంలో.. ఎన్నికల అనంతరం ఎన్‌డీఏ రాష్ట్రంలో ‘కింగ్ మేకర్’గా అవతరించే అవకాశాలనూ పండితులు కొట్టివేయటం లేదు. కమలదళానికి రెండు నుంచి 5 సీట్లు వస్తాయని అంచనా.

 ఇరు వైపుల నుంచీ ఆకర్షణ
 ఇక అధికార కూటమిపై అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభిస్తాయని ఆశిస్తున్న ఎల్‌డీఎఫ్‌కు, ఎలాగైనా సరే అధికారం నిలుపుకోవాలని భావిస్తున్న యూడీఎఫ్‌కు.. మూడో కూటమి ఆందోళన కలిగిస్తోంది. అయితే.. మూడో కూటమి గణనీయంగా ఓట్లు చీలిస్తే అది యూడీఎఫ్‌కే లాభిస్తుందన్న అంచనాలూ ఉన్నాయి. ఎందుకంటే.. రాష్ట్రంలో ఈళవ తదితర బీసీ హిందువులు ప్రధానంగా సీపీఎం మద్దతుదారులుగా ఉన్నారు. వారిని తమ వైపు తెచ్చుకునేందుకు బీజేపీ కృషి చేస్తోంది. అదే సమయంలో సంప్రదాయంగా కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్న హిందూ అగ్రకులాల వారు కూడా బీజేపీ వైపు మళ్లే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మూడో కూటమి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

 సినీ తారల అరంగేట్రం
 దక్షిణాది రాష్ట్రాల్లోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఎంజీఆర్, ఎన్‌టీఆర్ వంటి ప్రముఖ నటులు రాజకీయ ప్రపంచాన్ని ఏలితే.. కేరళ రాజకీయాల్లో మాత్రం ఇప్పటివరకూ సినీ నటులకు, స్టార్లకు పెద్ద స్థానం లేదు. వాస్తవానికి.. రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ పండితుల నుంచి.. టీ కొట్టు పండితుల వరకూ.. రాజకీయాలకు సినీ తారలు తగరని వాదిస్తుండేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు సినీ, టీవీ తారలు, క్రీడా ప్రముఖులు ఎన్నికల బరిలో కనిపిస్తుండటం పెద్ద విశేషం. గెలుపుగుర్రాలు, ఎలా అయినా గెలవటం అన్న మంత్రం కేరళకూ పాకిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలు పలువురు సినీ తారలను తమ తమ పార్టీల నుంచి బరిలోకి దింపుతున్నాయి.

మరిన్ని వార్తలు