దక్షిణ భారతీయులంతా నల్లవారే

8 Apr, 2017 02:22 IST|Sakshi
దక్షిణ భారతీయులంతా నల్లవారే

తరుణ్‌ విజయ్‌ నోటి దురుసు వ్యాఖ్యలు
బీజేపీ మాజీ ఎంపీ తీరుపై నెటిజన్ల మండిపాటు
ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్న కాంగ్రెస్, డీఎంకే


న్యూఢిల్లీ: భారత్‌లో జాత్యహంకారం లేదంటూనే బీజేపీ మాజీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతీయులంతా నల్లవారే అంటూ వివక్షపూరితంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఇటీవల నోయిడాలో ఆఫ్రికన్లపై జరిగిన దాడికి సంబంధించి ఓ టీవీ చానెల్‌ లో జరిగిన చర్చలో తరుణ్‌ మాట్లాడుతూ..  ‘భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గం. అదే నిజమైతే దక్షిణ భారతీయులతో ఎలా కలసి ఉంటాం. అక్కడ ఎక్కువ మంది నల్ల రంగులో ఉంటారు.

తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వాసులు నల్లగా ఉంటారనీ అయినా వారితో ఉంటున్నాం. నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తాం. మా చుట్టూ నల్లజాతీయులు ఉన్నారు’అని ఆయన వ్యాఖ్యానించారు. తరుణ్‌ విజయ్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్‌ అంటే ఉత్తరాది ఒకటే అని ఆయన భావిస్తున్నారని కామెంట్లు పెట్టారు.

దీనిపై ఆయన స్పందిస్తూ.. దక్షిణ భారతీయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తన ఉద్దేశం కాదని.. కేవలం భారత్‌లో జాతివివక్ష లేదని, విభిన్న సంస్కృతులు, విభిన్న రంగుల వారు కలిసి ఉంటామని చెప్పడమేనని ట్విట్టర్‌లో విజయ్‌ పేర్కొన్నారు. ఒకవేళ తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు.

తరుణ్‌ వ్యాఖ్యలపై విమర్శలు..
విజయ్‌ మాటలు తమను షాక్‌కు గురిచేశాయని.. బీజేపీ వివక్షను ఇది ప్రతిబింబించిందని కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. దక్షిణ భారతీయులంతా నల్లగా ఉండరన్న విషయాన్ని తరుణ్‌ గుర్తుంచుకోవాలని డీఎంకే నేత ఇలంగోవన్ , నటి, కాంగ్రెస్‌ నాయకురాలు కుష్బు అన్నారు. అయితే తరుణ్‌ విజయ్‌కు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఆయన మాటలను వక్రీకరించారని పేర్కొంది.

మరిన్ని వార్తలు