సల్మాన్ ఖాన్ను వీడని కష్టాలు...

19 Oct, 2016 11:19 IST|Sakshi
సల్మాన్ ఖాన్ను వీడని కష్టాలు...

న్యూఢిల్లీ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కు కృష్ణ జింక కష్టాలు వీడేలా కనిపించడం లేదు. కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్పై రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది జూలై  25న ఆ రాష్ట్ర హైకోర్టు సల్మాన్ నిర్ధోషి అంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.  కాగా 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.  సల్మాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు.

ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి.. ఒక కేసులో ఏడాది జైలు శిక్ష, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై సల్మాన్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. మిథానియా కేసులో సల్మాన్ అప్పీలును తిరస్కరించిన కోర్టు.. భావద్ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. సరైన సాక్షాలు లేవని సల్మాన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ కేసులో తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

>
మరిన్ని వార్తలు