ఉగ్రవేటకు బ్లాక్‌ క్యాట్‌ కమెండోలు

22 Jun, 2018 03:35 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల ఏరివేతకు కేంద్రం నిర్ణయం

నేడు అఖిలపక్ష భేటీకి గవర్నర్‌ పిలుపు

అణచివేతకే గవర్నర్‌ పాలన: పాక్‌

శ్రీనగర్‌/ న్యూఢిల్లీ/ ముంబై: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ) బ్లాక్‌ క్యాట్‌ కమెండోల సేవల్ని వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. జూన్‌ 28 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రముప్పుందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. కేంద్ర హోంశాఖ ఇప్పటికే 24 మంది ఎస్‌ఎస్‌జీ కమెండోల బృందాన్ని కశ్మీర్‌కు పంపిందని తెలిపారు. వీరు త్వరలోనే భద్రతాబలగాలతో కలసి ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొంటారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి ఎన్‌ఎస్‌జీ కమెండోల సంఖ్యను 100కు పెంచే అవకాశముందని వెల్లడించారు.

ఉగ్రవాదులు ప్రజల్ని బందీలుగా చేసుకుంటే లేదా విమానాల హైజాకింగ్‌కు పాల్పడితే వెంటనే ఘటనాస్థలికి చేరుకునేందుకు వీలుగా ప్రస్తుతం కమెండోలను శ్రీనగర్‌ విమానాశ్రయంలో మోహరించామన్నారు. ఎన్‌ఎస్‌జీ కమెండోల వద్ద ఉన్న గోడల్ని స్కానింగ్‌చేసే రాడార్లు, స్నైపర్‌ తుపాకులు, ఇంటి మూలల్లో నక్కిన ఉగ్రవాదుల్ని కాల్చగలిగే తుపాకులతో ఉగ్ర ఆపరేషన్లలో బలగాల ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందన్నారు. అలాగే యాత్రకు వాడే వాహనాల గమనాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ స్టిక్కర్లను అమర్చనున్నట్లు పేర్కొన్నారు. 10–15 డ్రోన్లను వినియోగించడంతో పాటు ఎమర్జెన్సీ నంబర్‌ 1364ను యాత్రికులకు అందుబాటులోకి తెస్తామన్నారు.

వేర్పాటువాదుల అరెస్ట్‌
జమ్మూకశ్మీర్‌లో సీనియర్‌ జర్నలిస్ట్‌ షుజాత్‌ బుఖారితో పాటు ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు కశ్మీరీల మృతికి నిరససగా వేర్పాటువాదులు గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ను గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయన్ను కోఠిబాగ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మితవాద హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ మిర్వాజ్‌ ఉమర్‌ ఫారుఖ్‌ను ఆయన స్వగృహంలో నిర్బంధించారు. అతివాద హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ సయ్యద్‌ అలీషా గిలానీ ఇప్పటికే గృహనిర్బంధంలో ఉన్నారు.

సీఎం మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి ఇటీవల బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించిన సంగతి తెలిసిందే. కాగా, వేర్పాటువాదుల పిలుపుతో కశ్మీర్‌ లోయలో మార్కెట్లు, దుకాణాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా శుక్రవారం అన్ని రాజకీయ పక్షాలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించారు. గవర్నర్‌ పాలన సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై అన్ని పార్టీల నేతలతో చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, కశ్మీరీలను మరింత అణచేందుకే జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించారని పాకిస్తాన్‌ విమర్శించింది.

మరిన్ని వార్తలు