అమ్మో భూతం..!

7 Dec, 2019 11:56 IST|Sakshi
భూతం సోకిన విద్యార్థికి మంత్రిస్తున్న భూత వైద్యుడు

విలవిల్లాడిన విద్యార్థులు

ఆదివాసీలను ఇంకా వీడని మూఢనమ్మకాలు

రాయగడ: జిల్లాలోని ఆదివాసీలను మూఢ నమ్మకాలు ఇంకా వీడడం లేదు. భూతం, పిశాచం, గాలి సోకడం వంటి వాటిని నమ్ముతూ భూత వైద్యులను ఆశ్రయించడం ఇంకా మానడం లేదు.  తాజాగా బిసంకటక్‌ సమితిలోని చాటికోన గ్రామంలో పాఠశాలలో  7,8 తరగతులు చదువుతున్న ఐదుగురు బాలికలు మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి సమయంలో పాఠశాల ఆవరణలో ఉన్న మర్రిచెట్టు కింద ఆడుకుంటుండగా ఒక్కసారిగా వారంతా మాకు భూతం సోకింది. రమ్మంటోంది. మేము వెళ్లిపోతాం అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ చెట్టుకింద పడి కాళ్లూచేతులు కొట్టుకోవడం, జుత్తు పీక్కోవడం వంటి చేష్టలు చేస్తూ వింతగా ప్రవర్తించారు.

మర్రిచెట్టు కింద భూతం సోకిందని చెప్పిన విద్యార్థులు
దీంతో తోటి విద్యార్థులు తక్షణం ఉపాధ్యాయులకు  తెలియజేయడంతో ఉపాధ్యాయులు కూడా వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న భూత వైద్యుడిని పిలిపించి మంత్రించి భూతాన్ని  వదిలించారు. తదుపరి ఉపాధ్యాయులు ఐదుగురు విద్యార్థులను  బిసంకటక్‌ ఆస్పత్రికి తరలించారు. వాస్తవంగా నేటి పరిస్థితుల్లో  దెయ్యాలు, భూతాలు లేవని, క్షుద్రశక్తులు, చేతబడులను నమ్మవద్దని ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆదివాసీ ప్రజలను ఇంకా మూఢ నమ్మకాలు విడనాడడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనంగా  నిలుస్తోంది. దీనికి తోడు భూతవైద్యుడు మంత్రించగా విద్యార్థులకు స్వస్థత కలగడంతో వారిలో మూఢ నమ్మకాలు ఇంకా పెరిగిపోతున్నాయి. 

మరిన్ని వార్తలు