ఆ నోట్లు.. కుళ్లుకంపు కొడుతున్నాయి!

16 Nov, 2016 16:56 IST|Sakshi
ఆ నోట్లు.. కుళ్లుకంపు కొడుతున్నాయి!
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించడంతో బ్యాంకుల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. వీళ్లంతా డిపాజిట్ చేస్తున్న దాంట్లోని నల్లడబ్బు కుళ్లిపోయిన తోలు వాసన వస్తోందట!! ఈ విషయాన్ని ఒక బ్యాంకు మేనేజర్ చెప్పారు.

కొంతమంది రాత్రిపూట కూడా బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు కాస్తున్నారు. డబ్బు రాగానే తామే ముందు తీసుకుని వెళ్లిపోవాలని ఇలా చేస్తున్నారు. బయట వేచి ఉన్నవాళ్లకు ఇన్ని ఇబ్బందులుంటే.. మరి లోపల బ్యాంకులో కూర్చుని ఇన్ని వేల మంది వస్తున్నా అందరికీ ఓపిగ్గా డబ్బులు ఇస్తూ, వాళ్ల వివరాలు నోట్ చేసుకుంటూ సెలవులన్నవి లేకుండా నిర్విరామంగా పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులు ఈ నిర్ణయం గురించి ఏమంటున్నారు? ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల తమకు పనిభారం పెరిగిపోయిందని ఏమైనా చెబుతున్నారా.. కానే కాదు. సాధారణంగా రెండో శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు. కానీ గత వారాంతంలో అన్ని బ్యాంకులూ పనిచేశాయి. మిగిలిన రోజుల్లో కూడా అదనపు సమయం పనిచేస్తున్నాయి. 
 
దీనిపై ముంబైకి చెందిన 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఫేస్‌బుక్ పేజిలో ఒక బ్యాంకు మేనేజర్ తన అభిప్రాయాన్ని రాశారు. ఊపిరి పీల్చుకోడానికి కూడా ఖాళీ లేకుండా.. అసలు తిండి, తిప్పలన్న మాటే మర్చిపోయి బ్యాంకు ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో ఆమె వివరించారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. 
 
''కొన్ని సంవత్సరాల తరబడి పేరుకుపోయిన నల్లడబ్బు మా దగ్గరకు వస్తోంది. ఈ డబ్బు అంతా కుళ్లిపోయిన తోలు వాసన వస్తోంది. అందుకే మా క్యాషియర్లందరికీ మాస్కులు కావాలని మేం ఆర్డర్ చేశాం. అంత ఘోరంగా ఈ డబ్బు వాసన వస్తోంది. ఇక బ్యాంకులకు వచ్చేవాళ్లు ఎంత దారుణంగా ఉంటున్నారో, మమ్మల్ని ఎంత నీచంగా చూస్తున్నారో.. నాలుగు గంటల క్రితం నాకు నాందేడ్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. నామీద ఎడతెరిపి లేకుండా తిట్లవర్షం కురిపిస్తూనే ఉన్నాడు. మరాఠీలో శాపనార్థాలు పెట్టాడు. ఇలాంటివి ప్రతిరోజూ కొన్ని డజన్లు మాకు ఎదురవుతాయి. పొద్దున్న బ్యాంకుకు డ్యూటీ సమయం కంటే ముందే వస్తాం. డ్యూటీ ముగిసిపోయిన చాలా సేపటి వరకు అక్కడే ఉంటాం. తిండి తిప్పల మాట దేవుడెరుగు.. కనీసం మంచినీళ్లు తాగే తీరిక కూడా ఉండట్లేదు. ఇలా గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి కూర్చున్నా.. రెండు గంటలు క్యూలో ఉన్నవాళ్లు మమ్మల్ని నానా తిట్లు తిట్టుకుంటూ మేమిచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్నారు. మరి మా కష్టాలు పట్టించుకునేవాళ్లు ఎవరూ ఉండరా? మరికొందరైతే వాళ్లు కోరినంత డబ్బులు మార్చకపోతే మా విషయాన్ని మీడియాకు చెప్పి తేలుస్తామని బెదిరిస్తున్నారు. అక్కడ బోలెడంత సీన్ క్రియేట్ చేస్తున్నారు'' అని ఆమె అన్నారు.