వలస కార్మికులపై బ్లీచ్‌ స్ప్రే

31 Mar, 2020 04:10 IST|Sakshi
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వలసకార్మికులపై బ్లీచ్‌ కలిపిన నీటిని స్ప్రేచేస్తున్న ఆరోగ్య సిబ్బంది

లక్నో/బరేలీ: లాక్‌డౌన్‌ కారణంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కార్మికులపై ప్రభుత్వయంత్రాంగాల నిర్లక్ష్య ధోరణికి తాజా ఉదాహరణ ఇది. భార్యాపిల్లలతో కలిసి వందలాది కిలోమీటర్లు కాలినడకన వస్తున్న బడుగు జీవులపై పారిశుధ్య సిబ్బంది కనికరం లేకుండా క్లోరిన్‌ నీటిని స్ప్రే చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీ, నోయిడాల్లో పనులు చేసుకునే షాజహాన్‌పూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన 50 మంది వలస కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబాలతోపాటు కాలినడకన సొంతూళ్లకు బయలుదేరారు.

సోమవారం ఉదయం బరేలీ బస్టాండ్‌ వద్ద బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కొందరు మున్సిపల్‌ సిబ్బంది వారి వద్దకు వచ్చారు. కరోనా వైరస్‌ను చంపే మందు స్ప్రే చేస్తామని, ఆ తర్వాత భోజనం పెట్టి, సొంతూళ్లకు బస్సుల్లో తీసుకెళతామని నమ్మ బలికారు. అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి బ్లీచింగ్‌ నీటిని వారిపైకి నిలువెల్లా తడిచిపోయేలా స్ప్రే చేశారు. దీంతో చిన్నారులు కళ్ల మంటలతో రోదించగా, పురుషులు, మహిళలు ఒళ్లంతా దురదతో ఇబ్బందిపడ్డారు. తడి దుస్తులతోనే వారంతా తిరిగి కాలినడక సాగించారు. కాగా, బడుగు జీవుల పట్ల మున్సిపల్‌ సిబ్బంది చూపిన కాఠిన్యంపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్రంగా స్పందించారు.

‘వలస కార్మికులపై రసాయనాలు స్ప్రే చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిందా? కార్మికులు పడిన యాతనలకు ఏం చికిత్స చేయించారు? స్ప్రే కారణంగా దుస్తులు తడిచిన వారికి ఏర్పాట్లు చేశారా? పాడైపోయిన వారి ఆహార పదార్థాలకు బదులుగా ఏం సమకూర్చారు?’అంటూ ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారంపై జిల్లా మేజిస్ట్రేట్‌ నితీశ్‌‡ స్పందించారు. స్థానిక సిబ్బంది చేసింది తప్పేనని ఒప్పుకున్నారు. ‘వలస కార్మికులు ప్రయాణించే బస్సులను శానిటైజ్‌ చేయాలని మాత్రమే ఆదేశించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం బాధితులకు అవసరమైన వైద్యం చేయిస్తాం’ అని వివరణ ఇచ్చారు. కాగా, లాండ్రీల్లో వాడే బ్లీచ్‌లో సోడియం హైపోక్లోరైట్‌ ఉంటుంది. దీనిని క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు.

మరిన్ని వార్తలు