గర్భిణికి హెచ్‌ఐవీ బ్లడ్‌.. రక్తదాత ఆత్మహత్యాయత్నం

28 Dec, 2018 09:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గర్భిణికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన వివాదం పెనుభూతంగా మారిపోగా ఇందుకు కారకులైన బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది నిర్లక్ష్యం ప్రభుత్వం మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: విరుదునగర్‌ జిల్లా సాత్తూరుకు చెందిన 8 నెలల గర్భిణికి శివకాశి ప్రభుత్వ ఆస్పత్రి అనుబంధ బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కించడం, ఆ రక్తం హెచ్‌ఐవీ రోగికి చెందినది కావడంతో గర్భిణి కూడా హెచ్‌ఐవీ రోగిగా మారిన సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ ఆస్పత్రులంటేనే భయాందోళనలకు గురయ్యేలా చేసింది. బాధిత కుటుంబ సభ్యులపై ప్రభుత్వం అనేక వరాలజల్లు కురిపించినా వారు శాంతించలేదు. తమకు తీరని అన్యాయం జరిగిందంటూ భార్యాభర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

సుమోటోగా కేసు స్వీకరణ
న్యాయవాదులు జార్జ్‌ విలియమ్స్, కృష్ణమూర్తి మద్రాసు హైకోర్టులోని సెలవు దినాల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తులు ఎస్‌.వైద్యనాథన్, పీడీ ఆషాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ముందుకు గురువారం హాజరయ్యారు. గర్భిణికి జరిగిన అన్యాయాన్ని విశదీకరించారు. ప్రభుత్వాస్పత్రులు ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తికి పనిచేస్తున్నట్లుగా తయారయ్యాయని దుయ్యబట్టారు. గర్భిణి నిండు జీవితాన్ని కాలరాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. న్యాయవాదుల ఆవేదనను విన్న అనంతరం న్యాయమూర్తులు మాట్లాడుతూ, ఈ ఘోరం తమ దృష్టికి కూడా వచ్చిందని, తీవ్రమైన ఆవేదన కలిగించిందని తెలిపారు. అధికారుల అలక్ష్యం సహించరానిదని అన్నారు.

ఈ దశలో ప్రభుత్వ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ అరవింద్‌ పాండియన్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఈ సంఘటనపై విచారణకు ఆదేశించిందని న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు. గర్భిణి ఘటనకు కారకులైన వారిపై చర్య తీసుకున్నామని, కోర్టు సెలవులు ముగిసిన తరువాత నివేదిక అందజేస్తామని చెప్పారు. గర్భిణి  కేసును సుమోటాగా స్వీకరిస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి, శివకావి ప్రభుత్వ వైద్యశాల నిర్వాహకులు, బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బందిపై కేసులు పెట్టాల్సిందిగా ఆదేశించారు. ఈ సంఘటనపై సవిరమైన నివేదికను సమర్పించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.  

శిశువుకు సోకకుండా..
గర్భంలోని శిశువుకు హెచ్‌ఐవీ సోకకుండా గర్భిణిని మదురైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో పెట్టారు.  ప్రత్యేక వైద్య చికిత్స కోసం ముగ్గురు వైద్యులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం నియమించింది. వ్యవహారంపై ఆరుగురితో కూడిన విచారణ కమిటీ రెండు వారాల్లోగా నివేదికను సమర్పిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు.

రక్తదాత ఆత్మహత్యాయత్నం
వదిన కోసం మరిది రక్తం దానం చేశాడు. అయితే అదృష్టం వదినె చెంత నిలువగా రక్తం రూపంలో దురదృష్టం గర్భిణిని వెతుక్కుంటూ వచ్చింది.. ప్రాణాల మీదకు తెచ్చింది. రామనాథపురం జిల్లా కముదికి చెందిన 19 ఏళ్ల యువకుడు శివకాశి బాణసంచా ప్రింటింగ్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అనారోగ్యానికి గురైన ఇతని అన్నభార్య (వదిన) ప్రసవం కోసం శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. వదినెకు రక్తం అవసరం కావడంతో అందుకు సరిపడా ఎవరైనా బ్లడ్‌బ్యాంకు రక్తం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సదరు యువకుడు నవంబరు 30వ తేదీన అదే ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్లిరక్తం ఇచ్చాడు. యువకుడు ఇచ్చిన రక్తాన్ని బ్లడ్‌బ్యాంక్‌లో భద్రం చేసుకున్న సిబ్బంది, య«థాలాపంగా మరో ప్యాకెట్‌లోని రక్తాన్ని అతని వదినకు ఎక్కించారు.

ఇదిలా ఉండగా, రక్త దానం చేసిన యువకుడు విదేశీ ఉద్యోగానికి వెళుతూ డిసెంబర్‌ 6వ తేదీన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందడంలో భాగంగా రక్తపరీక్షలు చేయించుకోగా హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో కంగారుపడిన యువకుడు బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్లి విషయం చెప్పాడు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే అతడిచ్చిన రక్తం గర్భిణికి ఎక్కించడం జరిగిపోయింది. తన రక్తం వల్లనే గర్భిణి హెచ్‌ఐవీ రోగిగా మారిందని యువకుడు తీవ్రంగా కలతచెందాడు. బుధవారం రాత్రి ఇంటిలోని ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లిదండ్రులు అతడిని వెంటనే రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం అతడిని ఐసీయూలో ఉంచి తీవ్రచికిత్స అందిస్తున్నారు. తనకు జీవించాలని లేదంటూ వైద్యచికిత్సకు అతడు సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఎండీఎంకే అధినేత వైగో విమర్శించారు. బాధిత మహిళకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు