రక్తం ధర ఇష్టారాజ్యం..

13 Nov, 2014 23:08 IST|Sakshi

సాక్షి, ముంబై: నగరంలో డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో రక్తానికి డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని పలు బ్లడ్‌బ్యాంక్‌లు రక్తం ధరను విపరీతంగా పెంచేస్తున్నాయి. దీంతో సరిపడా రక్తం కొనుగోలు చేయలేక పలువురు డెంగీ వ్యాధిగ్రస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రక్తం ధరల నియంత్రణకు నడుం బిగించింది.

ఈ మేరకు బీఎంసీ అడిషినల్ మున్సిపల్ కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎంసీ స్థిరీకరించిన రక్తం ధరలనే నగరంలోని అన్ని బ్లడ్‌బ్యాంకలు, ఆస్పత్రులు పాటించాలని సూచించారు. అలాగే ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు... బ్లడ్ డోనర్ల కోసం చూస్తున్న రోగుల బంధువుల నుంచి బ్లడ్ కోసం వత్తిడి చేయకూడదన్నారు.

 బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్, ప్లేట్‌లెట్‌ల కొరత లేదని దేశ్‌ముఖ్ తెలిపారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా బ్లడ్‌ను సిద్ధం చేస్తామన్నారు. అలాగే బ్లడ్ బ్యాంక్‌లు తమ ఆవరణలో బ్లడ్ యూనిట్ ధరలను అందరికీ కనబడేలా డిస్‌ప్లే చేయాలని బీఎంసీ సూచించింది. తాము నిర్ణయించిన దాని కంటే అధికంగా వసూలు చేయవద్దని ఆదేశించింది. తాము యూనిట్‌కు నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ ధర ఎవరైనా వసూలుచేస్తే.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి బ్లడ్ బ్యాంకుల లెసైన్సులు, ఎన్‌వోసీ లను రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో స్టేట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కౌన్సిల్ డాక్టర్ గోమారే, సైన్ ఆస్పత్రి డీన్ డాక్టర్ అవినాష్ సుపే తదితరులు పాల్గొన్నారు.   ఇదిలా ఉండగా, కార్పొరేషన్‌కు చెందిన బ్లడ్ బ్యాంక్‌లో రక్తం యూనిట్ ధరను రూ.540 నుంచి రూ.1,050కు పెంచినట్లు చెప్పారు. అలాగే ప్రైవేట్, చారిటబుల్ బ్లడ్ బ్యాంకుల్లో రూ.850 నుంచి రూ.1,450 వరకు పెంచారు.

>
మరిన్ని వార్తలు