కశ్మీర్‌లో పెరిగిన రక్తపాతం

20 Feb, 2019 15:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2016లో భారత సైనికులు పాకిస్తాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి టెర్రరిస్టు స్థావరాలను విధ్వంసం చేయడంతో కశ్మీర్‌ సమస్య పరిష్కారం కొత్త ఆశలు చిగురించాయి. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న కఠిన వైఖరికి పాకిస్తాన్‌ ప్రభుత్వం దిగివచ్చి టెర్రరిస్టు సంస్థలకు మద్దతివ్వడం మానుకుంటుందని, ఫలితంగా కల్లోలిత కశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయని ప్రభుత్వ వర్గాలతోపాటు రాజకీయ పరిశీలకులు భావించారు. ఆశలు నిరాశకాగా కశ్మీర్‌ పరిస్థితి మరింత అల్లకల్లోలంగా మారింది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు టెర్రరిస్టు దాడులు పెరిగాయి, ఎన్‌కౌంటర్లు పెరిగాయి. దాడుల్లో సైనికుల మరణాలు, ఎన్‌కౌంటర్లలో టెర్రరిస్టుల మరణాలు, రెండింటిలో పౌరుల మరణాలు గణనీయంగా పెరిగాయి. ఈ విషయాన్ని ‘దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్‌’ సేకరించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు జమ్మూ కశ్మీర్‌లో జరిగిన టెర్రరిస్టు దాడుల గణాంకాలను పరిశీలిస్తే 2014 నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాదిలో పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది సైనికులు మరణించదనే అతి పెద్ద సంఘటన. 

ఇక టెర్రరిస్టులు, సెక్యూరిటీ సైనికులు జరిపిన దాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య 2014 సంవత్సరంతో పోలిస్తే 2015, 2016 సంవత్సరాల్లో కాస్త తగ్గి ఆ తర్వాత వరుసగా రెండు సంవత్సరాల్లో పెరిగాయి. ఇక టెర్రరిస్టు దాడుల్లో సైనికులు మరణించడం కూడా 2014 సంవత్సరంతో పోలిస్తే ఒక్క 2015 సంవత్సరం మినహా అన్ని ఏళ్లు పెరుగుతూనే వచ్చాయి. ఇక సైనికులు జరిపిన ఎన్‌కౌంటర్లలో మరణించిన టెర్రరిస్టుల సంఖ్య 2014 సంవత్సరంతో పోలిస్తే ఒక్క 2015 సంవత్సరం మినహా మిగతా అన్ని సంవత్సరాలు పెరుగుతూ వచ్చాయి, టెర్రరిస్టులపై దాడులు పెరుగుతుంటే ఇరు వర్గాల మరణాల సంఖ్య పెరగడం సహజమని బీజేపీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్‌ ఎల్‌వోసీ వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలు పెరగడం, టెర్రరిస్టుల నియామకాలు గణనీయంగా పెరగడం ఆందోళనకరం. 

మరిన్ని వార్తలు