జమ్మూకశ్మీర్‌: పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

2 Oct, 2019 19:26 IST|Sakshi

జెడ్డా: జమ్మూకశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకశ్మీర్‌ విషయంలో ముస్లిం దేశమైన సౌదీ అరేబియా తమకు అండగా ఉంటుందని పాక్‌ భావించింది. అయితే, తాజాగా పాక్‌కు షాక్‌ ఇస్తూ కశ్మీర్‌ విషయంలో భారత్‌ వైఖరిని సౌదీ అరేబియా సమర్థించింది. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ బుధవారం సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటీ అయి.. కశ్మీర్‌ విషయంలో భారత వైఖరిని వివరించారు. వీరిద్దరి మధ్య జరిగిన ముఖాముఖి సమావేశం దాదాపు రెండుగంటలపాటు సాగింది. ఈ భేటీలో దోవల్‌తో యువరాజు సల్మాన్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌ విషయంలో భారత చర్యల పట్ల తన సానుకూలతను తెలిపినట్టు తెలిసింది. 

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దుచేసిన నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ హుటాహుటిన సౌదీ అరేబియాలో పర్యటించి.. ఆ దేశ మద్దతును కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్‌ విషయంలో భారత వైఖరికి అనుగుణంగా సౌదీ రాజు మద్దతు పలుకడం పాక్‌కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. దోవల్‌-సల్మాన్‌ భేటీలో కశ్మీర్‌ అంశంతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. భారత్‌-సౌదీ అరేబియా బంధాన్ని మరింత దృఢపరుచుకునేదిశగా దోవల్‌ సౌదీ పర్యటన సాగింది. 
 

మరిన్ని వార్తలు