ఆర్‌బీఐకి చిదంబరం కీలక సలహా

23 May, 2020 14:43 IST|Sakshi

 ప్రభుత్వానికి నిర్మొహమాటంగా చెప్పాలి - పీ చిదంబరం 

కర్తవ్య నిర్వహణలో మొహమాటం లేకుండా ఆర్‌బీఐ వ్యవహరించాలి

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కు  కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం  కీలక సూచన చేశారు. ఆర్‌బీఐ సత్యర చర్యల్ని కొనియాడిన ఆయన  తమ  కర్తవ్య నిర్వహణపై నిర్మొహమాటంగా  వ్యవహరించాలని సలహా  ఇచ్చారు.  తమ డ్యూటీ  చేసుకోమని  మొహ​మాటం లేకుండా ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే, ఆర్థిక చర్యలు తీసుకోవాలని కోరాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు చిదంబరం శనివారం సూచించారు. డిమాండ్ పడిపోతోందనీ, 2020-21లో వృద్ధి ప్రతికూలతవైపు మళ్లుతోందని చెబుతున్న శక్తికాంత దాస్‌ ఎక్కువ ద్రవ్య లభ్యతను ఎందుకు సమకూరుస్తున్నారంటూ ట్వీట్ చేశారు. (పీఏం కేర్స్‌’ కేటాయింపులపై చిదంబరం సందేహం)

మరోవైపు ఆర్థిక వ్యవస్థ దుస్థితిపై కేంద్రంపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మండిపడ్డారు. జీడీపీ క్షీణిస్తోందని స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ చెబుతున్నా,  జీడీపీలో 1 శాతం కంటే తక్కువగా ఉన్న ప్యాకేజీపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, ప్రభుత్వం  ప్రగల్భాలు పోతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమైన ప్రభుత్వ విధానాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ సిగ్గుడాలని వ్యాఖ్యానించారు.

భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఈ సంవత్సరం తగ్గిపోతుందని ప్రభుత్వం ప్రతినిధి, లేదా సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన కీలక వ్యక్తులు ఇలా ప్రకటించడం ఇదే మొదటిసారి. కాగా కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ ఆందోళనల మధ్య  భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది నెగిటివ్‌ జోన్‌లోకి  జారిపోతోంది. దీంతో శుక్రవారం నాటి పాలసీ రివ్యూలో   రెపో రేటును  4.0 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు